సౌదీకి ఇరాన్ యుద్ధ భయం
ABN , Publish Date - Aug 04 , 2026 | 06:01 AM
పశ్చిమాసియా యుద్ధం క్రమంగా ఇరాన్ నియంత్రణలోకి వస్తోంది. ఎక్కడ కొడితే అమెరికా వెనక్కి తగ్గుతుందో అక్కడే ఇరాన్ గురిచూసి కొడుతోంది. తన చుట్టూ ఉన్న అమెరికా మిత్రదేశాలపై..
యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని అమెరికాకు విన్నపాలు
తన విజన్ 2030పై ప్రభావం పడుతుందని భయం
రియాద్, ఆగస్టు 3: పశ్చిమాసియా యుద్ధం క్రమంగా ఇరాన్ నియంత్రణలోకి వస్తోంది. ఎక్కడ కొడితే అమెరికా వెనక్కి తగ్గుతుందో అక్కడే ఇరాన్ గురిచూసి కొడుతోంది. తన చుట్టూ ఉన్న అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ ఎడాపెడా దాడులు చేయటంతో ఆ దేశాలు యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని అమెరికాను వేడుకొంటున్నాయి. తాజాగా శనివారం సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్‌చేసి ఇరాన్‌పై ఇకపై దాడులు చేయొద్దని కోరారు. ఇరాన్ ఇంధన మౌలిక వసతులపై దాడులు చేస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా అలాంటి పని చేస్తే తాము సౌదీ, ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాల్లోని చమురు, విద్యుత్ మౌలిక వసతులను నేలమట్టం చేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. దీంతో ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలని సౌదీ అరేబియా అగ్రరాజ్యాన్ని కోరుతోంది. అందుకు మరో కారణం కూడా ఉంది. ఇప్పటివరకు సౌదీది చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. దీర్ఘకాలంపాటు ఇలాగే ఉంటే ప్రమాదమని గ్రహించిన ఎంబీఎస్.. 2030 అభివృద్ధి ప్రణాళిక పేరుతో దేశాన్ని పూర్తిగా మార్చేయాలని సంకల్పించారు. ఇంధనం, లాజిస్టిక్స్, టూరిజం, పరిశోధనలకు సౌదీని ప్రపంచానికి కేంద్రంగా మార్చాలని ఆయన భావిస్తున్నారు. ‘సౌదీ చేపట్టిన విజన్ 2030 అనేది ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు. అది ఒక విస్తృత జాతీయ ప్రాజెక్టు. భిన్నరంగాల్లో సౌదీని స్వయంసమృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటం దీని ముఖ్య లక్ష్యం’ అని సౌదీ రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా బిన్ అల్ షయా తెలిపారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు యుద్ధం కారణంగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అందుకే యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్‌ను ఎంబీఎస్ ప్రాధేయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..