Share News

రష్యా భీకర దాడి.. దద్దరిల్లిన ఉక్రెయిన్

ABN , Publish Date - Aug 30 , 2026 | 10:05 AM

ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన డ్రోన్ దాడిలో ఏకంగా 37 మంది మరణించారు. ఈ ఏడాది రష్యా చేసిన అత్యంత భీకర దాడి ఇదేనని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

రష్యా భీకర దాడి.. దద్దరిల్లిన ఉక్రెయిన్
Russian attack in Ukraine

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన డ్రోన్ దాడిలో ఏకంగా 37 మంది మరణించారు. ఈ ఏడాది రష్యా చేసిన అత్యంత భీకర దాడి ఇదేనని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. బుచా జిల్లాలోని మైలా ప్రాంతంలో ఆయుధాలను నిల్వ చేసిన గోదాముపై ఈ దాడి జరిగింది. గోదాము లోపలి ఆయుధాలు పేలిపోవడంతో మంటలు సమీపంలోని ఇళ్లు, భవనాలకు వ్యాపించి అనేక మంది దుర్మరణం చెందారు.

గురువారం నుంచి రష్యా ఉక్రెయిన్‌పై దాదాపుగా నిరంతర దాడులు చేస్తోంది. రాజధాని కియవ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై వరుస దాడులు జరగడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా మిసైల్స్‌ను సిద్ధం చేసిపెట్టుకున్న రష్యా క్రమం తప్పకుండా దాడులు చేస్తూ తమను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. వరుసపెట్టి జరుగుతున్న దాడులను ఎదుర్కొనే క్రమంలో ఉక్రెయిన్ ఆయుధ నిల్వలు అడుగంటిపోవాలనే వ్యూహంతో రష్యా ముందుకెళుతోందని చెబుతున్నారు. గగతల రక్షణ వ్యవస్థకు కీలకమైన పాట్రియల్ మిసైల్స్ నిల్వలు తగ్గిపోతున్నాయని ఇప్పటికే ఉక్రెయిన్ పలుమార్లు చెప్పింది. మిసైళ్ల సరఫరా పెంచాలని అమెరికాకు విజ్ఞప్తి చేసింది.


ఇక మైలాలో జరిగిన దాడిలో దాదాపు 50 భవనాలు దెబ్బతిన్నాయి. ఓ వృద్ధాశ్రమంలోని వారు కూడా దుర్మరణం చెందారు. దాదాపు 370 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. జనావాసాల మధ్య ఆయుధాలను ఎందుకు నిల్వ చేశారని స్థానికులు కొందరు ప్రశ్నించారు. కొందరి నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా అంగీకరించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో మళ్లీ కరోనా కలకలం

అమెరికా నియంత్రణలోకి వెనెజువెలా చమురు నిల్వలు

Updated Date - Aug 30 , 2026 | 10:26 AM