Share News

జపాన్‌ను కుదిపేసిన మరో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ABN , Publish Date - Jul 28 , 2026 | 01:33 PM

నైరుతి జపాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. 7.1 తీవ్రతతో భూకంపం రావడంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

జపాన్‌ను కుదిపేసిన మరో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Japan Earthquake

టోక్యో: జపాన్‌ను భారీ భూకంపం మరోసారి కుదిపేసింది. 7.1 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించడంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్‌లోని దక్షిణ కుమామోటో ప్రిఫెక్చర్‌లో ఇవాళ (మంగళవారం) 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) తెలిపింది. భూకంపం తర్వాత సముద్రంలో 3.28 అడుగుల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందంటూ జేఎంఏ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.


మరోవైపు, దక్షిణ క్యుషు ద్వీపంలోని కుమామోటో, నాగసాకి, కగోషిమా, ఫుక్యోకా, సాగా, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్‌లకు జపాన్ ప్రభుత్వం అత్యవసర భూకంప హెచ్చరికలను జారీ చేసింది. భూకంపం కారణంగా తమ హై-స్పీడ్ షింకన్సెన్ రైళ్లతో సహా పలు సర్వీసులను నిలిపివేసినట్లు రైల్ ఆపరేటర్ జేఆర్ క్యుషు తెలిపింది. అలాగే భూకంపం వల్ల సెందై, జెన్‌కై అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని క్యుషు ఎలక్ట్రిక్ పవర్ వెల్లడించింది. కాగా, భారీ భూకంపంతో ఒక్కసారిగా ఇళ్లన్నీ కదిలిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పలువురు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.


ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. ఇక్కడ సగటున ప్రతి ఐదు నిమిషాలకు ఓ భూ ప్రకంపన సంభవిస్తుంటుంది. జపాన్ దేశం రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి ఉండటంతో ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల్లో సుమారు 20 శాతం ఈ దేశంలోనే నమోదవుతుంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..

ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళ్ మిలన్ సమావేశం.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2026పై చర్చ..

Updated Date - Jul 28 , 2026 | 02:11 PM