Share News

ఏఐతో ముప్పు.. పోప్ లియో హెచ్చరిక

ABN , Publish Date - May 25 , 2026 | 09:39 PM

ఏఐతో రాబోయే ముప్పుపై పోప్ లియో పలు హెచ్చరికలు చేశారు. మానవాళి మేలు కోసం కాకుండా ధనార్జనే లక్ష్యంగా ఏఐ విషయంలో ముందుకెళ్లడం పాపమని స్పష్టం చేశారు.

ఏఐతో ముప్పు.. పోప్ లియో హెచ్చరిక
Pope on AI

ఇంటర్నెట్ డెస్క్: ఏఐతో రాబోయే ముప్పుపై పోప్ లియో పలు హెచ్చరికలు చేశారు. మానవాళి మేలు కోసం కాకుండా ధనార్జనే లక్ష్యంగా ఏఐ విషయంలో ముందుకెళ్లడం పాపమని స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు, యుద్ధాలకు ఏఐ కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు ఏఐతో కలిగే ప్రయోజనాలు, సమస్యలపై ఒక సవివరమైన లేఖను విడుదల చేశారు.

ఏఐ విషయంలో లాభాపేక్షతో ముందుకు సాగితే ప్రపంచవ్యాప్తంగా మనిషికి గౌరవం ఉండదని పోప్ హెచ్చరించారు. ఏఐపై గట్టి నియంత్రణ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆధునిక యుగంలో లాభాల వెంట పరుగుల పెట్టే ధోరణి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవాళి సుఖసంతోషాల కంటే ఉత్పాదకత, వాణిజ్య లాభాలకే ప్రాధాన్యం పెరిగే రోజులు దాపురించి, చివరకు మనుషులు డేటా పాయింట్స్‌గా, ఆర్థిక ఉత్పత్తులుగా మిగిలిపోవచ్చని అన్నారు. ఏఐ ఎప్పటికీ తటస్థం కాదని కూడా పోప్ స్పష్టం చేశారు. ఏఐని నిర్మించిన వారి ప్రాధాన్యాలు, ప్రయోజనాలను ఏఐ ప్రతిబింబిస్తుందని చెప్పారు. టెక్నాలజీని జనహితానికి వాడాలా? లేక మానుషుల మధ్య సంబంధాలు తేగిపోయే దుస్థితికి దిగజారాలా? అనేది తేల్చుకోవాలని చెప్పారు.


సమాజహితం కోసం ప్రజల్ని అనుసంధానించే టెక్నాలజీకి ప్రజల్ని విడగొట్టి, ఒంటరి వాళ్లను చేసి చివరకు కొత్త తరహా అన్యాయాలకు తెరతీసే శక్తి కూడా ఉందని పోప్ హెచ్చరించారు. ఇప్పటికే ఏఐ ప్రభావం మానవాళిపై కనిపిస్తోందని అన్నారు. దైనందిన జీవితంలోనూ ఏఐ ప్రభావం ఎక్కువైందని అన్నారు. జనాలకు తమపై తమకున్న అభిప్రాయాలను కూడా ఏఐ మారుస్తున్న వైనం ఇప్పటికే కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ కారణంగా యుద్ధంలో నైతిక కట్టుబాట్లు మరింత తగ్గొచ్చని చెప్పారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాన్ని యంత్రాల చేతుల్లో ఎన్నటికీ పెట్టకూడదని అన్నారు.

అయితే, ఏఐని తిరస్కరించాలని చెప్పడం తన ఉద్దేశం ఎంతమాత్రం కాదని కూడా పోప్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా సాంకేతిక అభివృద్ధి సాగేలా రక్షణలను ప్రభుత్వాలు, వ్యాపారాలు, పౌర సమాజం కలిసి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మానవాళికి ఏఐ ఉపయోగపడటమే అంతిమలక్ష్యంగా ఉండాలని పోప్ మార్గనిర్దేశనం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో విషాదం.. ట్రక్కు బోల్తాపడి 15 మంది మృతి

30 వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కు గుండెపోటు..

Updated Date - May 25 , 2026 | 09:49 PM