Share News

పీవోకేలో ఘర్షణలు.. 30 మందికి పైగా మృతి

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:01 AM

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పలుచోట్ల భద్రతా దళాలకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించారు. 200 మంది గాయపడ్డారు.

పీవోకేలో ఘర్షణలు.. 30 మందికి పైగా మృతి

  • 200 మందికి గాయాలు

న్యూఢిల్లీ, లండన్‌, జూన్‌ 9 : పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పలుచోట్ల భద్రతా దళాలకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించారు. 200 మంది గాయపడ్డారు. అక్కడి పౌర హక్కుల కూటమి జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ(జేఏఏసీ)ని అధికారులు నిషేధించడంతో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారం కోసం ఈ కూటమి పోరాడుతోంది. పీవోకేలోని రావల్‌కోట్‌, ముజఫరాబాద్‌లలో నిరసనకారులపై పాక్‌ భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఇంటర్‌నెట్‌ను కూడా నిలిపివేశారు. దీంతో అక్కడి ప్రజలు బంద్‌ పాటిస్తున్నారు. పీవోకేలో జూలై 27న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక చట్టసభలో శరణార్థుల కోసం కేటాయించిన సీట్లను రద్దు చేయాలని జేఏఏసీ డిమాండ్‌ చేస్తోంది. దీనిపై జూన్‌ 9న నిరసనలకు పిలుపునిచ్చింది. కాగా పీవోకేలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ బ్రిటన్‌కు చెందిన 50 మందికి పైగా ఎంపీలు ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. బ్రిటన్‌ ప్రభుత్వం ఈ ఉద్రిక్తతలను నివారించడానికి తగిన దౌత్య చర్యలు చేపట్టాలని ఆ లేఖలో కోరారు. కాగా పీవోకేలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోన్న పాక్‌ దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని భారత్‌ పేర్కొంది.

Updated Date - Jun 10 , 2026 | 04:01 AM