వాళ్లు ఒక్కటైతే తట్టుకోలేం.. పాక్‌లో పీక్స్‌కు జెన్-జీ భయం
ABN , Publish Date - Jul 31 , 2026 | 08:00 PM
పాక్ పాలకుల్లో జెన్-జీ భయం పతాకస్థాయికి చేరింది. దేశ జెన్-జీ యువత తిరగడబడితే తట్టుకోలేమని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసీన్ నఖ్వీ తాజాగా హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: జెన్-జీ.. భారత ఉపఖండంలో ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పేరు ఇది. బంగ్లాదేశ్, నేపాల్‌లో జెన్-జీ యువత ఇప్పటికే అక్కడి ప్రభుత్వాలను కూలదోసింది. భారత్‌లో జెన్-జీ నిరసనలు కేంద్ర మంత్రి రాజీనామాకు దారితీశాయి. ఈ నేపథ్యంలో పాక్ పాలకుల్లో జెన్-జీ భయం పతాకస్థాయికి చేరింది. దేశ జెన్-జీ యువత తిరగడబడితే తట్టుకోలేమని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసీన్ నఖ్వీ తాజాగా హెచ్చరించారు. ఇస్లామాబాద్‌లో ఎకనమిక్ సమ్మిట్-2026 సందర్భంగా నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు.
విఫలమైన వ్యవస్థలు..
పాక్ పాలన విధానం మౌలిక స్థాయిలో విఫలమైందని మంత్రి నఖ్వీ అన్నారు. పాలకులకు, యువతకు మధ్య అంతరం పెరిగిపోతోందని అన్నారు. యువతలో అసంతృప్తి, నిస్పృహ పతాకస్థాయికి చేరుకున్నాయని హెచ్చరించారు. ఆర్థిక అస్థిరత, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, విపరీతంగా పెరిగిన నిరుద్యోగిత కారణంగా యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకోవచ్చని హెచ్చరించారు.
వాళ్లు ఒక్కటైతే అంతా తలకిందులు..
భారత్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను కూడా మంత్రి ప్రస్తావించారు. ‘వాళ్లను యువత అనండి.. లేదా కాక్రోచ్‌లు అనండి.. లేదా మరో పేరేదైనా పెట్టుకోండి.. కానీ వీళ్లు ఏకమైతే మాత్రం పరిస్థితి తలకిందులు అవుతుంది’ అని నఖ్వీ హెచ్చరించారు. పాక్ ప్రభుత్వాలు యువతకు ఇస్తున్న ఉచిత లాప్‌టాప్‌లు, స్వల్ప స్టైఫెండ్స్ వంటి తాయిలాలు ఇక ఎంతమాత్రం పనిచేయవని నఖ్వీ అభిప్రాయపడ్డారు. యువత తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధమవుతోందని అన్నారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగావకాశాలు, వ్యవస్థల్లో పారదర్శకత, న్యాయం, సమాన అవకాశాలను ఆశిస్తోందని తెలిపారు.
ప్రస్తుత వ్యవస్థ కుప్పకూలిపోయినట్టేనని నఖ్వీ హెచ్చరించారు. వ్యవస్థాగత లోపాలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఆర్థిక రంగాన్ని నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. పైపై మెరుగులతో ఇక ఎంతమాత్రం ఉపయోగం ఉండదని అన్నారు. అధికార వికేంద్రీకరణ దిశగా కొత్త కార్యనిర్వహక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్
కరాచీలో ‘ధురంధర్’ సీన్ రిపీట్.. ఉజైర్ బలోచ్ సోదరుడిపై కాల్పులు