ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే రూ.70 లక్షల రివార్డు: పాక్
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:09 PM
జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్‌ను పట్టించిన వారికి ఇచ్చే రివార్డును 70 లక్షల రూపాయలకు పెంచినట్టు పాక్ తాజాగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదులకు నిధులు అందకుండా పాక్ తీసుకున్న చర్యలను సమీక్షించేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు పెద్ద కసరత్తు చేసుకున్నామని చెప్పుకునేందుకు పాక్ రంగంలోకి దిగింది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్‌ను పట్టించిన వారికి ఇచ్చే రివార్డును 70 లక్షల రూపాయలకు (పాక్ కరెన్సీ) పెంచింది. ఈ సమీక్షలో పాక్ విఫలమైతే మళ్లీ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేరాల్సి ఉంటుంది. దీంతో, అంతర్జాతీయ సంస్థల నిఘా పెరిగి పాక్‌కు ఆర్థిక లావాదేవీలు జరపడం మరింత కష్టంగా మారుతుంది.
భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైష్ ఉందన్న విషయం తెలిసిందే. పాక్ కేంద్రంగానే మసూద్ అజార్ తన కార్యకలాపాలను సాగిస్తుంటాడు. కానీ, అతడు తమ దేశంలో లేడని పాక్ ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇక ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా బహావల్‌పూర్‌లోని ఓ జైషే మహ్మద్ కేంద్రంపై భారత్ దాడి కూడా చేసింది. పాక్ జాతీయ దర్యాప్తు సంస్థ రూపొందించిన టాప్ ఉగ్రవాదుల జాబితాలో మసూద్ పేరును చేర్చారు. మసూద్ అజార్‌ను ఐక్యరాజ్య సమితి కూడా గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది.
భారత్‌లో 2001లో జరిగిన పార్లమెంటు దాడి, 2008 నాటి ముంబై దాడులు, 2016 పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి, 2019 నాటి పుల్వామా బాంబు దాడి ఘటనల్లో జైష్ హస్తం ఉందని భారత వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. గతేడాది ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో కూడా మసూద్ పేరు తెరపైకి వచ్చింది. 1995లోనే భారత్ మసూద్‌ను అరెస్టు చేసింది. అయితే, 1999లో విమానం హైజాక్ నేపథ్యంలో ప్రయాణికులను కాపాడుకునేందుకు మసూద్‌ను భారత్ విడిచిపెట్టాల్సి వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
'సెమికాన్ ఇండియా'.. హాజరుకానున్న 600కు పైగా గ్లోబల్ దిగ్గజాలు
నేడు ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్