Share News

వేలాది అమెరికా కంపెనీలపై ఉత్తర కొరియా హ్యాకర్ల సైబర్‌ దాడి

ABN , Publish Date - Apr 02 , 2026 | 07:00 AM

క్రిప్టో కరెన్సీని దొంగిలించడం కోసం ఉత్తర కొరియా హ్యాకర్లు (యూఎన్‌సీ1069 గ్రూప్‌) చెలరేగిపోయారు. వేలాది అమెరికా కంపెనీలను లక్ష్యంగా చేసుకుని మంగళవారంనాడు పెద్ద ఎత్తున...

వేలాది అమెరికా కంపెనీలపై ఉత్తర కొరియా హ్యాకర్ల సైబర్‌ దాడి

  • ఆయా సంస్థలు వాడే సాఫ్ట్‌వేర్‌లోకి మాల్‌వేర్‌

  • క్రిప్టో కరెన్సీ చోరీ కోసమే: గూగుల్‌ నిపుణులు

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 1: క్రిప్టో కరెన్సీని దొంగిలించడం కోసం ఉత్తర కొరియా హ్యాకర్లు (యూఎన్‌సీ1069 గ్రూప్‌) చెలరేగిపోయారు. వేలాది అమెరికా కంపెనీలను లక్ష్యంగా చేసుకుని మంగళవారంనాడు పెద్ద ఎత్తున సైబర్‌ దాడులు చేశారు. ఆయా కంపెనీలు తమ వెబ్‌సైట్ల నిర్వహణకు వాడే యాక్సియస్‌ అనే ఓపెన్‌సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రధాన డెవలపర్‌ ఖాతాను తొలుత హ్యాక్‌ చేసి, దానిపై సుమారు మూడు గంటలపాటు నియంత్రణ సాధించారు. ఆ సమయంలో ఆ సాఫ్ట్‌వేర్‌లో ఒక హానికరమైన కోడ్‌ను చొప్పించారు. దీంతో.. ఈ మాల్‌వేర్‌ ఉన్న సాఫ్ట్‌వేర్‌ వాడే కంపెనీలలోని కంప్యూటర్లన్నీ వారి అధీనంలోకి వచ్చాయి. వారు చొప్పించిన మాల్‌వేర్‌ ఆయా కంప్యూటర్లలో ఉన్న క్లౌడ్‌ పాస్‌వర్డ్‌లు, గిట్‌హబ్‌ కోడ్‌కీల వంటివాటిని దొంగిలించి ఆ సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేస్తుంది. దీనివల్ల ఆ హ్యాకర్లు ఆయా కంపెనీల అంతర్గత సర్వర్లలోకి సులువుగా చొరబడి తమకు కావాల్సిన సమాచారాన్ని పొందగలరు. అదే సమయంలో.. వారు చొప్పించిన మాల్‌వేర్‌ తన పని పూర్తికాగానే తనను తాను డిలీట్‌ చేసుకుంటుంది. దీనివల్ల అసలు హ్యాకింగ్‌ జరిగినట్టు గుర్తించడం కూడా కష్టమే. డెవలపర్‌ ఖాతాపై హ్యాకర్లు నియంత్రణ సాధించి, మాల్‌వేర్‌ చొప్పించిన మూడు గంటల సమయంలో.. యాక్సియోస్‌ సాఫ్ట్‌వేర్‌ 6 లక్షలసార్లు డౌన్‌లోడ్‌ అయినట్టు అంచనా. ఆ సమయంలో ఆ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న కంప్యూటర్ల, కంపెనీల గుట్టుమట్లన్నీ హ్యాకర్ల చేతికి చిక్కినట్టే. మాల్‌వేర్‌ తనను తాను డిలీట్‌ చేసుకోవడం వల్ల ఏయే కంపెనీలు ప్రమాదంలో ఉన్నాయో గుర్తించడానికి కూడా కొన్ని నెలల సమయం పడుతుందని సైబర్‌ భద్రత నిపుణులు చెబుతున్నారు. ఉత్తర కొరియా ప్రభుత్వం తన అణు కార్యక్రమాలకు అవసరమైన నిధులకోసం క్రిప్టో కరెన్సీని దొంగిలించడానికి ఇలాంటి దాడులు చేస్తోందని గూగుల్‌ మాండియెంట్‌ (ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైబర్‌ సెకూరిటీ సంస్థ) నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి యాక్సియోస్‌ సాఫ్ట్‌వేర్‌లో ఈ లోపాన్ని సరిచేసినప్పటికీ.. ఇప్పటికే ఇన్‌ఫెక్ట్‌ అయిన కంప్యూటర్లలో ఉన్న హ్యాకర్లను గుర్తించడం భద్రతాసంస్థలకు సవాల్‌గా మారనుంది. కాగా.. ఉత్తర కొరియా హ్యాకర్లు ఇలా సైబర్‌ దాడులు చేయడం ఇదేం కొత్త కాదని, గడిచిన కొన్నేళ్లలో పలు బ్యాంకులు, క్రిప్టో కరెన్సీ కంపెనీల నుంచి వారు వందల కోట్ల డాలర్లు దొంగిలించారని ఐక్యరాజ్యసమితి, పలు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.


అసలు ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమానికి వచ్చే నిధుల్లో సగానికి పైగా ఇలా సైబర్‌ దాడులు చేయడం ద్వారానే వస్తున్నాయని 2023లోనే వైట్‌హౌస్‌ అధికారి ఒకరు తెలిపారు. సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ ప్రకారం.. ఉత్తర కొరియా హ్యాకర్లు నిరుడు ఒక భారీ సైబర్‌ దాడి జరిపి 150 కోట్ల డాలర్ల (దాదాపు రూ.14 వేల కోట్ల) విలువైన క్రిప్టోకరెన్సీని దొంగిలించారు. దాన్ని చరిత్రలోనే అతి పెద్ద క్రిప్టో హ్యాక్‌గా చెబుతారు.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 07:00 AM