ఆపరేషన్ సిందూర్.. అణ్వాయుధాలపై ఐఏఈఏ హెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 22 , 2026 | 08:05 PM
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా అణ్వాయుధాలు వాడలేదని ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ రఫెల్ మారినో గ్రోసీ వెల్లడించారు. రెండు దేశాల మధ్య యుద్ధం సైనికుల మధ్య చోటు చేసుకున్న సాధారణ ఘర్షణ మాత్రమే అని అన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: 2025లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా అణ్వాయుధాలు వాడలేదని ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ రఫెల్ మారినో గ్రోసీ వెల్లడించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన భారత దేశానికి చెందిన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ అణ్వాయుధాల కదలికలు ఏమైనా గుర్తించారా? అనే ప్రశ్నకు గ్రోసీ స్పందిస్తూ..
‘యుద్ధం సందర్భంగా అణ్వాయుధాలను వినియోగించాలనే ప్రయత్నం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. రెండు దేశాల మధ్య యుద్ధం సైనికుల మధ్య చోటు చేసుకున్న సాధారణ ఘర్షణ మాత్రమే. ఐఏఈఏ కార్యకలాపాలు దేశాలు అంగీకరించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారమే కొనసాగుతాయి. మేము ప్రపంచవ్యాప్తంగా పనిచేసే న్యూక్లియర్ పోలీసులము కాదు. రాజకీయాలతో పాటు ఇతర అంశాల కారణంగా పాకిస్తాన్, భారత్ అణు ఆయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT)లో చేరకూడదని నిర్ణయించుకున్నాయి’
‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అణు కేంద్రాలు, అణు రియాక్టర్లు, ప్రయోగశాలలు, ఇతర సౌకర్యాలపై ఐఏఈఏ తనిఖీలు నిర్వహిస్తుంది. కానీ, అణు పరీక్షల విషయానికి వస్తే ఇందుకోసం వేరే సంస్థ ఉంది. వియన్నాలో ఉన్న సీటీబీటీఓ ఈ పనులు చూసుకుంటుంది. ఇది కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ కింద పనిచేస్తుంది. ఆ ఒప్పందం ఇంకా అమల్లోకి రాలేదు. కానీ, దాన్ని అణు పరీక్షలు జరిగాయా లేదా అన్నది నిర్ధారించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రమాణంగా భావిస్తారు’ అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి
డ్రంక్ అండ్ డ్రైవ్.. 270 మందికి జైలు శిక్ష
అది నిజం కాదు.. ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది: సునీతా విలియమ్స్