Share News

భారత్‌లో పత్రికాస్వేచ్ఛ ఆందోళనకరం!

ABN , Publish Date - May 19 , 2026 | 04:17 AM

భారత్‌లో మైనారిటీల హక్కులు, పత్రికాస్వేచ్ఛ, చట్టబద్ధపాలన స్థితిగతులపై నెదర్లాండ్స్‌ ప్రధానమంత్రి రాబ్‌ జెట్టెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌లో పత్రికాస్వేచ్ఛ ఆందోళనకరం!

  • మైనారిటీల హక్కులు, చట్టబద్ధపాలన కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి

  • మోదీ పర్యటనకు ముందు నెదర్లాండ్స్‌ ప్రధాని రాబ్‌ జెట్టెన్‌ వ్యాఖ్య

  • మోదీకి నార్వే అత్యున్నత పౌర పురస్కారం

ది హేగ్‌, మే 18: భారత్‌లో మైనారిటీల హక్కులు, పత్రికాస్వేచ్ఛ, చట్టబద్ధపాలన స్థితిగతులపై నెదర్లాండ్స్‌ ప్రధానమంత్రి రాబ్‌ జెట్టెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్‌లోనే కాదు యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాల్లోనూ.. భారత్‌లో ఉన్న పరిస్థితులపై ఆందోళన నెలకొని ఉందన్నారు. ప్రధాని మోదీ నెదర్లాండ్స్‌ పర్యటనకు ముందు స్థానిక మీడియా సంస్థలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇవి మోదీ నెదర్లాండ్స్‌ పర్యటన ముగించుకొని స్వీడన్‌కు వెళ్లిన తర్వాత మీడియాలో కనిపించాయి. ‘పత్రికాస్వేచ్ఛ మాత్రమే కాదు, మైనారిటీల హక్కులు కూడా భారత్‌లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ముస్లింల మీద ఇది అధికంగా ఉంది. ఇతర అల్పసంఖ్యాక మైనారిటీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పౌరులందరికీ సమాన హక్కులు వర్తించే సమీకృత సమాజంగా భారత్‌ ఏ మేరకు నిలిచిఉందన్నదే మా ఆందోళన అంతా! మా అభ్యంతరాలను భారత ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం’ అని జెట్టెన్‌ వెల్లడించారు. భారత్‌, ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో.. ఆర్థిక అంశాలేగాక ఇతర అంశాల గురించి కూడా మాట్లాడే అవకాశం లభించిందన్నారు. అందువల్లే భారత్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరచటం, చట్టబద్ధపాలన మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నామన్నారు. భారత్‌లో ఉన్న నెదర్లాండ్స్‌ బాలిక ఇన్‌సియా హిమానీని స్వదేశానికి రప్పించటం గురించి సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ఇన్‌సియా తల్లిదండ్రులు షెహ్‌జాద్‌ హిమానీ, నాదియా రషీద్‌ మధ్య గొడవల నేపథ్యంలో.. 2016లో ఇన్‌సియాను భారతీయుడైన షెహ్‌జాద్‌ బలవంతంగా భారత్‌కు తీసుకొచ్చాడు. అప్పుడు ఇన్‌సియా వయసు రెండేళ్లు. తన కుమార్తెను తిరిగి తనకు అప్పగించాలని గత పదేళ్లుగా ఇన్‌సియా తల్లి నాదియా రషీద్‌ న్యాయపోరాటం చేస్తున్నారు. కాగా, మోదీ-జెట్టెన్‌ మధ్య జరిగిన చర్చల్లో.. భారత్‌లో మైనారిటీల పరిస్థితి, పత్రికాస్వేచ్ఛ తదితర అంశాల ప్రస్తావన రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Updated Date - May 19 , 2026 | 04:17 AM