నేపాల్‌లో మళ్లీ జెన్-జీ నిరసనలు
ABN , Publish Date - Jul 12 , 2026 | 09:58 PM
నేపాల్ ప్రభుత్వ విధానాలపై స్థానిక యువత మళ్లీ ఉద్యమ బాట పట్టింది. ఖట్మాండూలో పలు చోట్ల నివసిస్తున్న నిర్వాసితులను బాలేన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం బలవంతంగా సంరక్షణ కేంద్రాలకు తరలించడంపై అక్కడి జెన్-జీ యువత మండిపడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ ప్రభుత్వ విధానాలపై స్థానిక యువత మళ్లీ ఉద్యమ బాట పట్టింది. ఖట్మాండూలో పలు చోట్ల నివసిస్తున్న నిర్వాసితులను బాలేన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం అమానవీయంగా సంరక్షణ కేంద్రాలకు తరలించడంపై అక్కడి జెన్-జీ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పునరావాస ప్రణాళిక లేకుండా అకస్మాత్తుగా పేదల్ని ఇలా తరలించడం అన్యాయమంటూ నిరసన బాట పట్టింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, కొన్ని రోజుల క్రితం ఈ నిరసనలు ప్రారంభం అయ్యాయి. నదీతీరాల వెంబడి అక్రమంగా నివసిస్తున్న పేదలను ప్రభుత్వం సంరక్షణ కేంద్రాలకు తరలిస్తోంది. వరద ముప్పు తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తోందంటూ జెన్ జీ మళ్లీ నిరసన బాట పడుతోంది. పునరావాస ప్రణాళిక లేకుండా పేదల్ని ఇలా తరలించడం అన్యాయమని నినదిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు తన బైక్‌కు వీల్ లాక్ వేశారన్న కోపంలో ఇటీవల ఒక యువకుడు తనకు తాను నిప్పంటించుకున్నాడు.
ఇక గత శుక్రవారం ప్రభుత్వం కొందరు నిర్వాసితులను బలవంతంగా సంరక్షణ కేంద్రానికి తరలించడంతో నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. చివరకు వారిని అదుపు చేసేందుకు పోలీసుల బ్యాటన్ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో గాయపడ్డ ఒక సామాజిక కార్యకర్త ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నేడు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఖట్మాండూలోని ఒక ప్రభుత్వ కార్యాలయం ముందు భారీ నిరసన కార్యక్రమం జరిగింది. యువత ప్లాకార్డుల ప్రదర్శనలు, నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. పేదలను చిత్ర హింసలకు గురి చేయొద్దని యువత నినదించారు.
ఇదిలా ఉంటే, ప్రభుత్వ తీరుపై నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గగన్ కుమార్ థాపా మండిపడ్డారు. అరెస్టు చేసిన సామాజిక కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలు బాలెన్ షా ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
1600 సిరీస్, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల మద్య తేడా తెలుసా?
విరాళాల చోరీ నిందితులకు శిక్ష పడే వరకూ రెస్టు తీసుకోను: కేజ్రీవాల్