నేపాల్‌లో వరదలు.. 98కి చేరిన మృతుల సంఖ్య..
ABN , Publish Date - Aug 26 , 2026 | 09:34 PM
నేపాల్ వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 98కి చేరింది. 400 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్‌లో బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మెరుపు వరదలు వచ్చాయి. ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. వందల మంది జనం వరద నీటిలో కొట్టుకుపోయారు. వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 98కి చేరింది. 400 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 400 మందిలో 133 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
77 మంది ఈషా యాత్రికుల గల్లంతు..
నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన మెరుపు వరదల్లో ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులు, ముగ్గురు వాలంటీర్లు గల్లంతయ్యారు. కైలాస మానససరోవర యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా, చైనా-నేపాల్ సరిహద్దుల్లోని గైరాంగ్ వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ కార్యాలయంపై వరద ముంచెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈషా ఫౌండేషన్ ద్వారా 21 గ్రూపులుగా వెళ్లిన వారిలో 495 మంది సురక్షితంగా వెనక్కి వచ్చారని ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. మిగిలిన వారిలో 743 మంది టిబెట్‌లో.. 148 మంది నేపాల్‌లోని ఇతర ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. స్వయంగా ఆ ప్రాంతంలోనే ఉంటూ.. ఈషా ఫౌండేషన్ బృందాలు, స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.