నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్టు
ABN , Publish Date - Mar 28 , 2026 | 08:04 AM
నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది జెన్ జీ నిరసనల్లో పలువురు ప్రాణాలు పోగొట్టుకోవడంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాజాగా ఓలీతో పాటు మాజీ హోం మంత్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. గత ఏడాది అక్కడి జెన్-జీ నిరసనల్లో పలువురు మరణించడంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఓలీతో పాటు మాజీ హోం మంత్రి రమేశ్ లేఖక్‌ను కూడా అరెస్టు చేశారు. ‘ఈ ఉదయం వారిని అరెస్టు చేశాము. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఖట్మాండు వ్యాలీ పోలీసుల ప్రతినిధి తెలిపారు.
ఓలీ అరెస్టు అయిన కాసేపటికి హోం మంత్రి సుదన్ గురుంగ్ స్పందిస్తూ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యానించారు. ‘మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని, మాజీ హోం మంత్రి రమేశ్ లేఖక్‌ను అరెస్టు చేశాము. ఇది ఎవరిపైనా ప్రతీకారం కాదు. న్యాయం సాధించేందుకే మా ప్రయత్నం. ఇకపై దేశం నూతన మార్గంలో ప్రయాణిస్తుంది’ అని మంత్రి సుదన్ గురుంగ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
అయితే, ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు దిగిందని కేపీ శర్మ ఓలీ అన్నారు. ఈ అరెస్టు అందులో భాగమేనని కామెంట్ చేశారు. చట్టపరంగా తాను ప్రభుత్వాన్ని ఎదుర్కుంటానని చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో నిరసనబాట పట్టిన నేపాల్ జెన్ -జీ యువతరం ఓలీ ప్రభుత్వాన్ని గద్దె దించిన విషయం తెలిసిందే. అయితే, నాటి నిరసనల్లో 70 మందికి పైగా కన్నుమూశారు. ఈ ఘటనలపై విచారణ జరిపేందుకు ఎన్నికల అనంతరం ప్రత్యేక పార్లమెంటరీ ప్యానల్ ఏర్పాటైంది. ఇక శుక్రవారం ప్రధాని బాలేంద్ర షా ఆధ్వర్యంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. పార్లమెంటరీ ప్యానల్ సూచనలను అమలు చేయాలని ఈ సమావేశంలో ప్రధాని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాజీ హోం మంత్రి లేఖక్ అరెస్టు అయ్యారు.
ఈ వార్తలూ చదవండి
సౌదీలోని అమెరికా ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడి.. అమెరికా సిబ్బందికి గాయాలు
హవాయిలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ముగ్గురి మృతి