Share News

నవనీతం పిళ్లైకు శాంతి నోబెల్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 02:16 AM

భారతీయ మూలాలు కలిగిన దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయ కోవిదురాలు నవనీతం పిళ్లైను (నవీ పిళ్లై) ప్రతిష్ఠాత్మక శాంతి నోబెల్‌ వరించింది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రచారం, పరిరక్షణకు అందించిన విశేష సేవలకుగాను 2026 సంవత్సరానికి ఆమెను ఈ అవార్డుకు నార్వే నోబెల్‌ కమిటీ ఎంపిక చేసింది.

నవనీతం పిళ్లైకు శాంతి నోబెల్‌
Navanitham pillay

pilley.jpg

  • అంతర్జాతీయ చట్టాల పరిధి పెంచి బాధితుల స్వరమైన నవనీతం

  • తల్లిదండ్రులు నారాయణసామి నాయుడు, శాంతమ్మ నాయుడు

  • బ్రిటిషర్ల హయాంలో వారి కుటుంబం దక్షిణాఫ్రికాకు వలస

  • జాతి వివక్ష వాతావరణంలో పెరిగిన నవీ.. అవమానాల మధ్యనే ఉన్నత విద్య

  • దక్షిణాఫ్రికాలో నల్లజాతి తొలి లాయరు నుంచి హైకోర్టు జడ్జి దాకా ఎదిగిన తీరు

  • జాతి వివక్షపై పోరుకు బాసట.. అంతర్జాతీయ కోర్టు జడ్జిగా సంచలన తీర్పులు

  • స్త్రీలపై అత్యాచారాలను యుద్ధ నేరాలుగా పరిగణించాలంటూ చరిత్రాత్మక తీర్పు

  • రువాండా, శ్రీలంక, గాజాలకు వెళ్లిన మిషన్లకు నేతృత్వం

  • ప్రపంచ న్యాయ సూత్రాలకు వన్నె తెచ్చారు.. కొనియాడిన నార్వే నోబెల్‌ కమిటీ

ఓస్లో, అక్టోబరు 9: భారతీయ మూలాలు కలిగిన దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయ కోవిదురాలు నవనీతం పిళ్లైను (నవీ పిళ్లై) ప్రతిష్ఠాత్మక శాంతి నోబెల్‌ వరించింది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రచారం, పరిరక్షణకు అందించిన విశేష సేవలకుగాను 2026 సంవత్సరానికి ఆమెను ఈ అవార్డుకు నార్వే నోబెల్‌ కమిటీ ఎంపిక చేసింది. అప్పటివరకు దేశాలకే పరిమితమైన జాతుల హననం, మహిళలపై లైంగిక హింసకు సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ చట్టాలు దృష్టి పెట్టి, వాటికి ఒక రూపం ఇవ్వడంలోఆమె కృషిని కమిటీ శ్లాఘించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలిగా, ఇంటర్నేషనల్‌ కోర్టు ఆఫ్‌ జస్టిస్‌ (రువాండా) న్యాయమూర్తి హోదాలో మానవ హక్కుల భావన విస్తరణకు, శాంతి సాధనకు తోడ్పాటు అందించారని తెలిపింది. హింస, యుద్ధాలకు బాధితులైన వారి పక్షాన, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కట్టుబడి నవీ పిళ్లై పనిచేశారని పేర్కొంది. శాంతి ప్రపంచం చట్టాలు సరిగ్గా పనిచేసినప్పుడే సాధ్యమని ఆమె బలంగా నమ్మారని నోబెల్‌ కమిటీ కొనియాడింది.


పేదరికం, జాతి వివక్షతో పోరాటం..

నవీ పిళ్లై 1941 సెప్టెంబరు 23న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించారు. తల్లిదండ్రులు నారాయణసామి నాయుడు, శాంతమ్మ. నవీ జన్మించడానికి ముందే ఆమె తాతయ్య నిర్బంధ కూలీగా తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తండ్రి బస్‌ డ్రైవరు సహా అనేక వృత్తులు చేశారు. దారిద్య్రం, వర్ణ వివక్ష వాతావరణంలో నవీ పిళ్లై పెరిగి పెద్దయ్యారు. ఆమెతో కలిపి మొత్తం 8మంది పిల్లల పోషణ ఆ పేద కుటుంబానికి కష్టంగా ఉండేది. కానీ, నవీ కష్టపడి చదివి నల్ల జాతికి చెందిన తొలి న్యాయవాదిగా ఎదిగారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకుని దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ తట్టుకుంటూ, నాతల్‌ ప్రావిన్సీలో న్యాయవాదిగా 1967లో వృత్తి జీవితం ప్రారంభించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న పోరాటాలకు న్యాయ గొంతుకగా మారారు. న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఆమె చేసిన పోరాటం వల్లే అక్కడి రాజకీయ ఖైదీలకు లభించింది. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నవారి కేసులను ఆమె వాదించారు. జాతీయ మహిళా సంకీర్ణ సమితి సభ్యురాలిగా, వివక్షను నిషేధిస్తూ, రాజ్యాంగంలో కొత్తగా సమానత్వ నిబంధనను పొందుపరచడంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష రద్దయిన తర్వాత, 1995లో హైకోర్టు న్యాయమూర్తిగా నవీ పిళ్లై బాధ్యతలు తీసుకున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో 2008-14 వరకు న్యాయ సేవలు అందించారు. అంతర్జాతీయ క్రిమినల్‌ ట్రైబ్యునల్‌(రువాండా వ్యవహారాలు) అధ్యక్షురాలిగా, అంతర్జాతీయ క్రిమికల్‌ కోర్టు న్యాయమూర్తిగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం హై కమిషనర్‌గా కీలక మిషన్లలో భాగమయ్యారు.


శ్రీలంకకు నాడే హెచ్చరికలు

నవీ పిళ్లై 2013లో శ్రీలంకలో పర్యటించారు. మత మైనారిటీలపై అమలవుతున్న హింస, వివక్షను ఆ పర్యటనలో ఆమె ప్రపంచం దృష్టికి తెచ్చారు. ఉత్తర జాఫ్నాలోని తమిళ కుటుంబాలను కలుసుకుని, యుద్ధ సమయంలో తప్పిపోయిన వారి కుటుంబసభ్యులు, దురాక్రమణకు గురైన వారి భూములు, సైనిక శిబిరాల్లో దుర్భరంగా గడుస్తున్న వారి జీవితాల గురించి వివరాలు సేకరించారు. వీటన్నింటికీ మితిమీరిన అధికార కేంద్రీకరణే కారణమంటూ ఆక్షేపించారు. ఇకనైనా విధానాలను మార్చుకోవాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. పిళ్లై అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. ఆ తర్వాత నాలుగేళ్లకే శ్రీలంక అంతర్యుద్ధంలో చిక్కుకోవడం గమనార్హం.

అత్యాచారమూ యుద్ధనేరమే..

అంతర్జాతీయ క్రిమినల్‌ ట్రైబ్యునల్‌ (రువాండా వ్యవహారాలు)లో న్యాయమూర్తి నవీ పిళ్లైతో కూడిన ధర్మాసనం అప్పట్లో ఇచ్చిన తీర్పు సంచలనం రేపింది. ప్రభుత్వాధినేతలు తాము సాగించే మారణహోమంలో అత్యాచారాలను సైతం ఆయుధాలుగా వాడుకుంటున్నారని రువాండా మాజీ మేయర్‌ జీన్‌ పాల్‌ అకయెసు కేసులో ట్రైబ్యునల్‌ తేల్చింది. అంతర్జాతీయ యుద్ధ నేరాల జాబితాలో అత్యాచారాన్ని కూడా చేర్చింది. 1994లో రువాండాలో సాగిన రక్తపాతం సందర్భంగా 2వేల మందికి పైగా మహిళలపై పెద్దఎత్తున అత్యాచారాలు జరిగాయి. ఈ నేరాలకు బాధ్యునిగా మాత్రమే కాకుండా, యుద్ధ నేరస్థుడిగాను అకయెసును ప్రకటించింది. కాగా, భారత మూలాలున్న నవనీతమ్‌ ‘నవీ’ పిళ్లైను నోబెల్‌ శాంతి బహుమతి వరించడంపై భారతదేశానికి చెందిన ప్రముఖులు అభినందనలు తెలిపారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థి, శశిథరూర్‌ తదితరులు వారిలో ఉన్నారు.


ట్రంప్‌తో అవార్డు పంచుకుంటా

నవీ పిళ్లై సరదా వ్యాఖ్య

శాంతి నోబెల్‌ ప్రకటించినప్పుడు నవీ పిళ్లై జర్మనీలోని నూరెంబర్గ్‌ నగరంలో ఉన్నారు. ఆమెను కలిసి మీడియా అభినందించిన సందర్భంలో, తనకే శాంతి నోబెల్‌ రావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చేస్తున్న ప్రకటనల అంశం ప్రస్తావనకకు వచ్చింది. దీనిపై ఆమె సరదాగా స్పందించారు. ‘‘మీరు మరింతగా భుజం తడితే, ట్రంప్‌తో కలిసి నేను అవార్డును పంచుకోవచ్చు.’’ అని వ్యాఖ్యానించారు.

ఈ వార్తలు కూడా చదవండి

నోబెల్ దక్కలేదని ట్రంప్ అసహనం.. విజేత పిళ్లైపై విమర్శలు

జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం

Updated Date - Oct 10 , 2026 | 02:16 AM