Share News

యుద్ధం.. ఉధృతం

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:39 AM

పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. పౌర మౌలిక సదుపాయాలపైనా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌లో వంతెనను అమెరికా పేల్చివేస్తే.. గల్ఫ్‌ దేశాల్లోని చమురు, విద్యుత్‌ ప్లాంట్లు, డీసాలినేషన్‌ ......

యుద్ధం.. ఉధృతం

  • తీవ్రస్థాయిలో దాడులు.. మౌలిక సదుపాయాల విధ్వంసం

  • ఇరాన్‌లోని ఎత్తయిన వంతెనను పేల్చేసిన అమెరికా

  • 8 మంది మృతి.. 95 మందికి గాయాలుప్రతీకారంగా పశ్చిమాసియాలోని

  • 8 భారీ వంతెనలను కూల్చేస్తామని ఇరాన్‌ ప్రకటన

  • కువైట్‌ చమురు రిఫైనరీపై దాడి.. అబుధాబిలో క్షిపణి శకలాలు పడి ఐదుగురు భారతీయులకు గాయాలు

  • మరో ఎఫ్‌-35ను కూల్చేశామన్న ఐఆర్‌జీసీ

  • గాలింపు చేపట్టిన అమెరికా హెలికాప్టర్‌ను కూడా..!

  • పైలట్లను ప్రాణాలతో పట్టిస్తే భారీ బహుమతి అంటూ ఇరాన్‌ స్థానిక అధికారుల ప్రకటన

  • ఇరాన్‌ సైన్యం ఆధీనంలో ఒక పైలట్‌?

  • బ్రిడ్జి పేల్చివేత అమెరికా నైతిక పతనానికి సాక్ష్యం

  • దౌత్యానికి తలుపులు పూర్తిగా మూసుకున్నాయి

  • ఇక చర్చలు ఉండవు: ఇరాన్‌ విదేశాంగ మంత్రి

  • ఇరాన్‌లో వంతెనలు, విద్యుత్కేంద్రాలు ధ్వంసం చేస్తాం

  • హోర్ముజ్‌ను తెరిచి, చమురు స్వాధీనం చేసుకోగలం

  • ఆలస్యం కాకముందే ఒప్పందానికి రావాలి: ట్రంప్‌

దుబాయ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. పౌర మౌలిక సదుపాయాలపైనా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌లో వంతెనను అమెరికా పేల్చివేస్తే.. గల్ఫ్‌ దేశాల్లోని చమురు, విద్యుత్‌ ప్లాంట్లు, డీసాలినేషన్‌ వ్యవస్థలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుంది. అటు అమెరికా యుద్ధ విమానాన్నీ కూల్చివేసింది. దాడులు చేయబోమంటూనే అమెరికా మోసానికి పాల్పడిందని ఇరాన్‌ ఆరోపిస్తే... ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌లో వంతెనలు, విద్యుత్‌ ప్లాంట్లు ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌లోని టెహ్రాన్‌ నుంచి కరాజ్‌ ప్రాంతాన్ని కలిపే భారీ వంతెన ‘బీ1 బ్రిడ్జ్‌’ను అమెరికా శుక్రవారం పేల్చివేసింది. ఆ పేలుళ్ల వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. ఇంకా ఆలస్యం కాకముందే ఇరాన్‌ ఒప్పందానికి రావడం మంచిదని హెచ్చరించారు. నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న ఈ వంతెన పశ్చిమాసియాలోనే ఎత్తయినదిగా చెబుతున్నారు. 446 అడుగుల (136 మీటర్ల) ఎత్తయిన ఈ వంతెనపై తొలుత వైమానిక దాడి చేసిన అమెరికా.. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో రెండో సారి బాంబులు వేసింది. ఆ సమయంలో వంతెనకు సమీపంలో పర్షియన్‌ కొత్త సంవత్సరం ‘నౌరుజ్‌’ వేడుకల ముగింపు కార్యక్రమం జరుగుతోంది. వందలాది మంది గుమిగూడి ఉన్నారు. దాడిలో వారిలో 8 మంది మృతిచెందగా.. 95 మందికిపైగా గాయపడినట్టు ఇరాన్‌ వెల్లడించింది. బ్రిడ్జి పేల్చివేత ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడింది. దీనికి ప్రతీకారంగా పశ్చిమాసియాలోని ఎనిమిది భారీ, కీలక వంతెనలను పేల్చివేస్తామని ప్రకటించింది. కువైట్‌లోని షేక్‌ జబేర్‌ సీబ్రిడ్జి, యూఏఈలోని అల్‌ మఖ్తా, షేక్‌ ఖలీఫా, షేక్‌ జాయెద్‌ వంతెనలు, బహ్రెయిన్‌-సౌదీలను కలిపే కింగ్‌ ఫాహాద్‌ కాజ్‌వే, జోర్డాన్‌లోని కింగ్‌ హుస్సేన్‌, దమియా, అబ్డౌన్‌ వంతెనలను కూల్చివేస్తామని హెచ్చరించింది.


మరో ఎఫ్‌-35ను కూల్చేసిన ఇరాన్‌!

అమెరికాకు చెందిన మరో అత్యాధునిక స్టెల్త్‌ యుద్ధ విమానం ఎఫ్‌-35 లైట్నింగ్‌-2ను కూల్చివేసినట్టు ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది. గత 24 గంటల్లో ఇది రెండోదని, మొత్తంగా మూడో ఎఫ్‌-35ని అమెరికా నష్టపోయిందని పేర్కొంది. శుక్రవారం సెంట్రల్‌ ఇరాన్‌లోని కోహ్గిలుయే ప్రాంతంలో ఈ ఫైటర్‌ కూలిపోయి, భారీ పేలుళ్లు జరిగాయని తెలిపింది. అయితే అందులోని పైలట్లు ముందే ఎజెక్ట్‌ వ్యవస్థ ద్వారా బయటపడి నేలపై దిగారని.. వారి కోసం అమెరికా హెలికాప్టర్లు, సీ-130 హెర్క్యులస్‌ విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ గాలింపు చేపట్టాయని వెల్లడించింది. గాలింపు వీడియోలను కూడా విడుదల చేసింది. ఆ అమెరికన్‌ పైలట్‌ను ప్రాణాలతో పట్టిస్తే ‘విలువైన బహుమతి’ ఇస్తామని ఇరాన్‌ సైనికాధికారులు ప్రకటించారు. అయితే సదరు పైలట్లను ఇప్పటికే ఇరాన్‌ సైన్యం పట్టుకుందనే వార్తలూ వెలువడుతున్నాయి. ఇరాన్‌లో ఒక యుద్ధ విమానం కూలిపోయిందని, రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించినట్టుగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, సీఎన్‌ఎన్‌ తెలిపాయి. ఒక పైలట్‌ను గుర్తించి రక్షించారని వెల్లడించాయి. కూలిపోయినది ఎఫ్‌-15ఈ ఫైటర్‌ అయి ఉంటుందని.. ఎందుకంటే ఎఫ్‌-35లో ఒకరే పైలట్‌ ఉంటారని, ఎఫ్‌-15ఈలో ఇద్దరు పైలట్లు ఉంటారని విశ్లేషించాయి. కూలిపోయిన యుద్ధ విమానం శకలాలను, పైలట్లను గుర్తించేందుకు అమెరికా బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌, సీ-130 హెర్క్యులస్‌ విమానాలతో గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో వాటిపైనా ఇరాన్‌ డ్రోన్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఒక హెలికాప్టర్‌ కూలిపోయిందని ఇరాన్‌ మెహర్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.


కువైట్‌ చమురు రిఫైనరీపై దాడి

ట్రంప్‌ బెదిరింపు ప్రకటనలు, మౌలిక సదుపాయాలపైనా అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో.. ఇరాన్‌ కూడా భారీ స్థాయిలో దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాలపైకి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. కువైట్‌లోని చమురు రిఫైనరీపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులతో భారీగా మంటలు చెలరేగాయి. దానితోపాటు ఇరాన్‌ క్షిపణి దాడుల్లో ఒక విద్యుదుత్పత్తి కేంద్రం, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే డీసాలినేషన్‌ కేంద్రం దెబ్బతిన్నట్టు కువైట్‌ ప్రకటించింది. యూఏఈలో అతిపెద్దదైన ‘హబ్షాన్‌ గ్యాస్‌ రిఫైనరీ’పై క్షిపణుల శకలాలు పడి, పేలుళ్లు జరిగాయని.. భారీగా మంటలు చెలరేగడంతో తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశామని అబుధాబి మీడియా కేంద్రం ప్రకటించింది. యూఏఈలోని అబుధాబిలో క్షిపణుల శకలాలు పడి ఐదుగురు భారతీయులు సహా 12 మంది గాయపడ్డారు. ఒక నేపాలీ వ్యక్తి మృతిచెందారు. దుబాయ్‌లోని ఒరాకిల్‌, బహ్రెయిన్‌లోని అమెజాన్‌ ఐటీ సంస్థల డేటా సెంటర్లపై దాడులు చేశామని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ శుక్రవారం ప్రకటించింది. పశ్చిమాసియాలోని తమ శత్రుదేశాల టెక్‌ సంస్థలన్నీ లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. అయితే ఒరాకిల్‌ డేటా సెంటర్‌పై దాడి ఏమీ జరగలేదని, అది తప్పుడు వార్త అని దుబాయ్‌ పేర్కొంది. బహ్రెయిన్‌లోని తమ డేటా సెంటర్లపై దాడులు జరిగినట్టు అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఇరాన్‌లోని బుషెహర్‌ ప్రావిన్స్‌లో ప్రజలకు మానవతా సాయం కింద సరుకులను తరలిస్తున్న రెండు కంటెయినర్లు, రెండు బస్సులు, పలు అత్యవసర వాహనాలు శుక్రవారం యూఎస్‌, ఇజ్రాయెల్‌ దాడిలో ధ్వంసమైనట్టు రెడ్‌ క్రాస్‌/రెడ్‌క్రిసెంట్‌ సంస్థల ఫెడరేషన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌లోని జఫా ప్రాంతంపై పదుల సంఖ్యలో బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసినట్టు యెమెన్‌లోని హౌతీ మిలిటరీ ప్రతినిధి యహ్యా సరీ వెల్లడించారు.

Updated Date - Apr 04 , 2026 | 04:39 AM