మెక్సికో డ్రగ్స్ ముఠా డాన్ హతం! పలు రాష్ట్రాల్లో అల్లర్లు
ABN , Publish Date - Feb 23 , 2026 | 09:59 AM
మెక్సికోలో డ్రగ్స్ ముఠా నాయకుడు ఎల్ మెంచో మృతితో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. పలు రాష్ట్రాల్లో వాహనాలు, పెట్రోల్ బంక్‌లు, రోడ్లు వంటి ప్రజా ఆస్తులను ధ్వంసం చేశాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మెక్సికో అధ్యక్షురాలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: మెక్సికోకు చెందిన డ్రగ్స్ ముఠా డాన్ ఎల్ మెంచోను ఆర్మీ మట్టుపెట్టిన నేపథ్యంలో దేశంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. డ్రగ్స్ ముఠాల సభ్యులు పలు చోట్ల ప్రతీకార దాడులకు తెరతీశారు. మెక్సికోలోని డజనుకు పైగా రాష్ట్రాల్లో అల్లకల్లోలానికి తెరతీశారు. వాహనాలకు నిప్పు పెట్టడం, రోడ్లను ధ్వంసం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. హలిస్కో రాష్ట్ర రాజధాని గ్వాదలహారాలో ముఠాలు అల్లర్లకు తెరతీశాయి. కొన్ని ప్రాంతాల్లో గ్యాంగ్ సభ్యులు బహిరంగంగా కాల్పులకు తెగబడ్డారు. పెట్రోల్ బంక్‌లు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్‌లకు నిప్పు పెట్టారు.
నిందితులు ఒక ఎయిర్‌పోర్టులోకి కూడా చొరబడి అరాచకం సృష్టించడంతో ప్రయాణికులు భయంతో పారిపోయారు. భారీ పొక్లెయిన్‌లతో అల్లరి మూకలు రోడ్లను తవ్వుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బమ్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
హలిస్కో రాష్ట్రంలోని తపాల్పా ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతడిని మెక్సికో నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. ఘటనా స్థలంలో నలుగురు మరణించగా మరో ఇద్దరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. డ్రగ్స్ ముఠా సభ్యుల నుంచి వాహనాలు, రాకెట్ లాంచర్లు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
అఫ్గానిస్థాన్‌లో పాక్ వైమానిక దాడులు
సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్‌నకు అమెరికన్ల డిమాండ్