Share News

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:57 AM

ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.8గా నమోదైంది..

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

  • 32మంది మృతి, 200మందికి గాయాలు

  • రిక్టర్‌ స్కేలుపై 7.8గా నమోదు.. సునామీ హెచ్చరికలు జారీ

మనీలా, జూన్‌ 8: ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి ఇప్పటివరకు 32మంది ప్రాణాలు కోల్పోగా, 200మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంప తీవ్రతకు పొరుగుదేశాలైన ఇండోనేషియా, పలావుతో పాటు సుదూరంగా ఉన్న జపాన్‌ దక్షిణ తీరంలో అలలు ఎగసిపడ్డాయి. మలేషియాలోని పలు ప్రాంతాలు కంపించాయి. ఈ విపత్తు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. భూమి తీవ్రంగా కంపించడంతో జనరల్‌ శాంటోస్‌ నగరంల 12 మంది గల్లంతయ్యారు. ఫిలిప్పీన్స్‌లోని కొండప్రాంతమైన గ్లాన్‌ పట్టణంలో కొండచరియలు విరిగి పడటంతో ఈ ఒక్క ప్రాంతంలోనే 13 మంది మరణించారు. భూకంపం కారణంగా తీరప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని ఫసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్‌ తీరంలో దాదాపు 3 అడుగుల ఎత్తులో అలలు బయటకు రావడంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.

Updated Date - Jun 09 , 2026 | 03:57 AM