Share News

పీవోకేను శ్మశానంగా మార్చేశారు!

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:22 AM

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో పాక్‌ సైన్యం చేస్తున్న అరాచకాలను జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ మహిళా సామాజిక కార్యకర్త ఐక్యరాజ్య సమితి వేదికగా ఎండగట్టారు

పీవోకేను శ్మశానంగా మార్చేశారు!
UNO

  • పాక్‌ అరాచకాలను ఎండగట్టిన కశ్మీరీ మహిళా కార్యకర్త

జెనీవా, సెప్టెంబరు 23: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో పాక్‌ సైన్యం చేస్తున్న అరాచకాలను జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ మహిళా సామాజిక కార్యకర్త ఐక్యరాజ్య సమితి వేదికగా ఎండగట్టారు. పీవోకే ప్రాంతాన్ని పాక్‌ ఒక శ్మశానంలా మార్చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులను పాక్‌ బలగాలు కాల్చి చంపుతున్నాయని ఆరోపించారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. ‘అసోసియేషన్‌ ఆఫ్‌ టెర్రర్‌ విక్టిమ్స్‌ ఇన్‌ కశ్మీర్‌’ (ఏటీవీకే) తరఫున పనిచేస్తున్న, బారాముల్లాకు చెందిన తస్లీమా అఖ్తర్‌ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న యూఎన్‌హెచ్‌ఆర్సీ 63వ సమావేశంలో ఈ మేరకు ప్రసంగించారు. ప్రాథమిక హక్కులు, ఆర్థిక సంక్షోభంపై పీవోకేలో ప్రజలు శాంతియుత నిరసనలు చేస్తుంటే.. పాక్‌ ప్రభుత్వం ఇంటర్నెట్‌ నిలిపివేసి, వందలాది మందిని అరెస్ట్‌ చేసి, కాల్పులతో డజన్ల కొద్దీ అమాయకులను పొట్టనబెట్టుకుందని తస్లీమా పేర్కొన్నారు. పాక్‌ ఈ ప్రాంతాన్ని ‘ఆజాద్‌ కశ్మీర్‌’ (స్వతంత్ర కశ్మీర్‌) అని పిలవడం ఒక పెద్ద అబద్ధమని, అక్కడ కనీస పౌర స్వేచ్ఛ కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. భారత్‌ పరిధిలోని జమ్మూకశ్మీర్‌ స్మార్ట్‌ సిటీలు, మౌలిక వసతులు, ఉపాధి కల్పనతో దూసుకుపోతుంటే, పాక్‌ ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌ మాత్రం దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతోందని వివరించారు.

Updated Date - Sep 24 , 2026 | 05:22 AM