Share News

అమెరికాతోనే గాజాలో శాంతి

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:09 AM

పాలస్తీనాలో హమా్‌సను అంతమొందించి, శాంతిని, అభివృద్ధిని నెలకొల్పే అమెరికా శాంతి ప్రణాళిక విజయవంతమవుతుందనే భరోసాను భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి రూవెన్‌ అజర్‌ వ్యక్తం చేశారు.

అమెరికాతోనే గాజాలో శాంతి

  • ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ‘భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి’ రూవెన్‌ అజర్‌

న్యూఢిల్లీ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పాలస్తీనాలో హమా్‌సను అంతమొందించి, శాంతిని, అభివృద్ధిని నెలకొల్పే అమెరికా శాంతి ప్రణాళిక విజయవంతమవుతుందనే భరోసాను భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి రూవెన్‌ అజర్‌ వ్యక్తం చేశారు. పాలస్తీనీయులపై ఇజ్రాయెల్‌ ఊచకోతకు పాల్పడుతోందనేది దుష్ప్రచారమని, యుద్ధంలో సాధారణ జనం మరణించకుండా తాము పలు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఐక్యరాజ్యసమితిపై తమకు నమ్మకం లేదని, ఆ సంస్థలో అనేక హమాస్‌ శక్తులు చేరాయన్నారు. భారత్‌, ఇజ్రాయెల్‌.. రెండూ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయని, ఇరు దేశాలు కలిసికట్టుగా ఉగ్రవాదుల పీచమణచాలన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి దావో్‌సలో ఇజ్రాయెల్‌ సంస్థలతో జరిపిన చర్చలు ఫలవంతం అవుతాయని భావిస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఎ.కృష్ణారావుకు రూవెన్‌ అజర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.

ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా రూపొందిస్తున్న ప్రణాళిక విజయవంతమవుతుందా? దీనిపై అనుమానాలున్నాయి.

ఈ ప్రణాళికలో అమెరికా నాయకత్వం పాలు పంచుకోవడం మాకు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మా ప్రాంతంలో కొందరు తమ సైనిక ఓటమిని కూడా దౌత్య విజయంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి, మాకు సైనిక విజయాన్ని దౌత్య విజయంగా మార్చడం అవసరం. యుద్ధం దౌత్యానికి కొనసాగింపు అంటారు. దౌత్యం కూడా యుద్ధానికి కొనసాగింపు. మా జీవితాల్లోంచి ఉగ్రవాద ముప్పును శాశ్వతంగా తొలగించడం ఎలా అన్నదే మాకు ప్రధానం. అమెరికా ప్రణాళిక విజయవంతమవుతుందని మేం విశ్వసిస్తున్నాం.

అమెరికా ప్రణాళికకు ప్రాధాన్యం ఉందా?

హమాస్‌ వద్ద చిక్కుకుపోయిన మా బందీలనందర్నీ వెనక్కి తీసుకురాగలిగాం. నిన్ననే చివరి బందీ శవమై తిరిగి వచ్చాడు. మేము హమాస్‌ సైనిక యం త్రాంగాన్ని ధ్వంసం చేయగలిగినా, ఆ సంస్థ మళ్లీ నిలదొక్కుకుని మాపై దాడిచేసే ప్రమాదం ఉంది. దౌత్యమార్గాల్లో హమా్‌సను ధ్వంసం చేయడమే అమెరికా శాంతి ప్రణాళిక ప్రయత్నం. గాజాలో సగానికిపైగా ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉంది. అయినప్పటికీ, గాజాలో అత్యధిక జనాభా నివసించే ప్రాంతం హమాస్‌ ని యంత్రణలో ఉన్నది. హమాస్‌, ఫతాల పాత్రలేని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పర్చడమే అమెరికా ప్రణాళిక లక్ష్యం.


అసలు అమెరికా ఎందుకు చొరవ తీసుకుంటోంది? ఐక్యరాజ్యసమితి ఉంది కదా. ట్రంప్‌ ఐక్యరాజ్యసమితి ఉనికే లేనట్లుగా వ్యవహరిస్తున్నారని చాలా దేశాలు కూడా విమర్శిస్తున్నాయి.

ఐరాస భద్రతా మండలి అమెరికా 20 సూత్రాల ప్రణాళికను సమర్థిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అంటే మాకు భద్రతా మండలి మద్దతున్నట్లే కదా. ఐరాస (యూఎన్‌) పాత్ర మరింత ఉండాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే కొన్ని యూఎన్‌ ఏజెన్సీలు హమా్‌సతో కుమ్మక్కయ్యాయి. ప్రధానంగా యూఎన్‌ శరణార్థుల సహాయ సంస్థ. 1948లో ఏర్పడ్డ ఈ సంస్థ ఘర్షణ నిరంతరం కొనసాగేలా చేస్తోంది. పాలస్తీనా శరణార్థులకు పునరావాసం లభించకుండా ఉండటమే దాని లక్ష్యం. ఈ సంస్థలో హమాస్‌ సీనియర్‌ అధికారులు ఉన్నారు. అందువల్లే మేం శాంతి ప్రణాళిక విషయంలో ఐరాసను నమ్మటం లేదు.

పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ ఊచకోతకు పాల్పడుతోందన్న ఆరోపణల్లో నిజం లేదా?

ఐరాసలో అనేక ప్రతికూల దేశాలు అంతర్జాతీయ చట్టాల్ని తిరగరాయాలని చూస్తున్నాయి. ఇజ్రాయెల్‌ కావాలనే పాలస్తీనా పిల్లల్ని ఆకలితో మాడేలా చేస్తోందని, ఊచకోత కోస్తోందని చిత్రిస్తున్నారు. గాజాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకాలు వేసిన పిల్లల సంఖ్య.. యుద్ధానికి ముందున్న పిల్లల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. మరెక్కడ వారు ఆకలితో మరణించినట్లు? నిజానికి, యుద్ధంలో ప్రజలు మరణించకుండా ఇజ్రాయెల్‌ చేయగలిగినంతా చేసింది. ఈ యుద్ధంలో మరణించిన సాధారణ ప్రజల సంఖ్య ఎంతో తక్కువ.

ఇజ్రాయెల్‌ దాడుల్లో 70 వేల మంది మరణించారని చె బుతున్నారు.. అది తక్కువా?

అది నిజం కాదు. ఈ 70 వేలమందిలో 11 వేలమంది సహజంగా మరణించారు. మామీద హమాస్‌ ప్రయోగించిన రాకెట్లు విఫలమై 5 వేలమంది దాకా మరణించారు. మృతుల్లో కనీసం 25 వేలమంది హమాస్‌ ఉగ్రవాదులు ఉంటారు. నగరాల్లో జరిగే యుద్ధాల్లో జననష్టం అధికంగా ఉంటుంది. మరణించే సైనికులతో పోల్చితే అది 1:4 లేదా 1:5 నిష్పత్తిలో ఉంటుంది. కానీ, ఈ యుద్ధంలో మరణించిన ప్రజల సంఖ్య తక్కువే. అయితే ఒక్కరైనా మరణించడం విషాదకరమే.


కానీ, ఇజ్రాయెల్‌ దురాక్రమణదారు అని, పాలస్తీనా ప్రజలపై మారణ హోమం జరుపుతోందని భారత్‌ లో ఎక్కువ మంది అనుకుంటున్నారు.

అవును. ఈ కథనాన్ని మార్చాలి. వాస్తవాలను వక్రీకరిస్తూ తమవైన కట్టుకథలను వ్యాపింపజేసే ఐరాస సభ్య దేశాలు, ఖతార్‌ నుంచి అల్‌జజీరా, టర్కీ నుంచి టీఆర్‌టీ, ముస్లిం దేశాలను సమర్థించే కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ కథనాన్ని నడిపిస్తున్నాయి. పాలస్తీనా ఉగ్రవాదసంస్థలకు అండగా నిలిచే ప్రజలతో పోలిస్తే మాది చాలా తక్కువ జనాభా ఉన్న యూదు దేశం. అందువల్ల సాధారణ మీడియాలో మీరు చెప్పినట్లుగానే పరిస్థితులున్నాయి.

పాలస్తీనాకు అనుకూలంగా మా దగ్గర కవిత్వం, సాహిత్యం కూడా వస్తోంది. ఇజ్రాయెల్‌పై కవిత్వం ఎవరూ రాయరు కదా..

ఈ పరిస్థితిని మార్చడం మాకు నిజంగానే ఒక సవాలు. వాస్తవానికి ఇజ్రాయెల్‌ చాలా దేశాల కంటే ఎక్కువగా ఉన్నత ప్రమాణాలను పాటిస్తోంది. మా మీద హమాస్‌ మాత్రమే కాదు ఏడు వైపులనుంచి ప్రత్యర్థులు దాడులు చేశారు. ఇరాన్‌ పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతునిచ్చింది. లెబనాన్‌లోని హిజ్బుల్లా, సిరియా, ఇరాక్‌, ఎమెన్‌లోని మిలీషియాలు, సమారియాలోని ఉగ్రవాద సంస్థలు దీనివెనుక ఉన్నాయి. రెండేళ్లపాటు పాటు మేము అసాధారణమైన ప్రయత్నాలు చేశాం. సహజంగానే మాకు అనుకూలంగా కథనాలను సృష్టించడానికి మావద్ద వనరులు లేవు. ఇజ్రాయెల్‌ అన్ని రంగాల్లో భద్రతను పునరుద్దరించగలిగింది. పా లస్తీనా ప్రజలకోసం ఉజ్వల భవిష్యత్‌ను ఆశిస్తున్నాం.

నా చిన్నప్పటి నుంచి పాలస్తీనా సమస్య గురించి వింటూనే ఉన్నాము. జిమ్మీ కార్టర్‌ నుంచి ట్రంప్‌ వరకు అమెరికా అధ్యక్షులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈసారి విజయవంతమవుతుందా?

శాంతి ఏర్పడుతుందనే విశ్వాసం నాకు కూడా లేదు. అయితే, అందుకోసం బాగా కష్టపడాలి. కొంతమంది అమెరికా అధ్యక్షులు తమ ప్రయత్నాల్లో విజయం సాధించారు. ఈజిప్టులో, జోర్డాన్‌లో శాంతి ఏర్పడింది. నాలుగు అరబ్‌ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ప్రయత్నాలు కొనసాగాల్సిందే. మాకు శాంతి చాలా ముఖ్యం. మా పొరుగుదేశాలతో మంచి సంబంధాలున్నాయి. పాలస్తీనీయులు కూడా శాంతి ఏర్పర్చుకునేందుకు ఎన్నో అవకాశాలు ఇచ్చాం.


అరాఫత్‌ లాంటి నేత ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు కదా..

వారు ఒక దేశంగా ఉండవచ్చని 2000లో మేము ప్రతిపాదించాం. కానీ, అరాఫత్‌ నిరాకరించారు. కొంత విరామం తర్వాత ఆయన రెండవ ఇంతిఫదా పేరుతో మరో యుద్ధాన్ని ప్రారంభించారు. 2007, 2008లో కూడా రెండుసార్లు వారు దేశంగా ఏర్పడవచ్చని ప్రతిపాదించాం. 2005లో గాజా నుంచి ఉపసంహరించుకున్నాం. కానీ, ఎప్పటికప్పుడు ఉగ్రవాద సంస్థలు ఈ అవకాశాల్ని ఉపయోగించుకుని ఇజ్రాయిల్‌పై దాడులు చేశాయి. అందుకే ఇకపై అలాంటి వాటిని మేము అనుమతించదలుచుకోలేదు.

శాంతి మండలిలో పాకిస్థాన్‌ను అమెరికా ఎలా చేర్చింది? పాక్‌ స్వయంగా భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది కదా.. మీరెలా మద్దతునిస్తారు?

శాంతి మండలిలో ఎవర్ని తీసుకోవాలో ట్రంప్‌ నిర్ణయిస్తారు. దౌత్యానికి సంబంధించిన నిబంధలను మేం నిర్దేశించలేం కదా. భద్రతా ప్రయోజనాల విషయంలో మాత్రం మేము పట్టుదలతో ఉంటాం. హమాస్‌ యంత్రాంగాన్ని కుప్పకూల్చేంతవరకూ మేము గాజా నుంచి ఉపసంహరించుకోం.

భారత్‌పై పాక్‌ ఉగ్రవాద దాడుల మీద మీ అభిప్రాయం? పహల్గామ్‌ దాడిని ఖండించారు కదా..

ఎక్కడైనా ఉగ్రవాదం ఉగ్రవాదమే. యుద్ధతంత్రంలో దాన్ని ప్రయోగించడకూడదు. ప్రజలను లక్ష్యంగా పెట్టుకోకూడదు. ఉగ్రవాదం ఒక అంతర్జాతీయ యుద్ధం. భారత్‌, ఇజ్రాయిల్‌ కలిసి అందులో పాల్గొనాలి. సైనికంగా మాత్రమే కాదు, దౌత్యపరంగా కూడా.

నిజంగానే శాంతి ఏర్పడితే ట్రంప్‌కు నోబెల్‌ బహుమతి వచ్చినట్లేనా? (నవ్వి) ఏం జరుగుతుందో చూద్దాం. భారతదేశంతో మీ సంబంధాల గురించి చెప్పండి

మాపై హమాస్‌ దాడి, పహల్గామ్‌ దాడి అనంత రం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌-ఇజ్రాయెల్‌ మఽధ్య ప్రత్యేక సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ స్నేహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి. రక్షణ రంగంలో ఒప్పందాలు కుదిరాయి. పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు మరో ఒప్పందంపై చర్చలు జరుగుతున్నా యి. స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం విధి విఽధానాలపై మేం సంతకం చేశాము. ఈ ఏడాది చివరకు ఈ ఒ ప్పందం పూర్తవుతుంది. 2025లో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ ఉద్యోగులు, కార్మికుల సంఖ్య రెట్టింపు అయింది. నిర్మాణరంగంలో అత్యంత నైపుణ్యంకల భారతీయ కార్మికులతో మాకెంతో ప్రయోజనం కలుగుతోంది. ఇజ్రాయెల్‌ కంపెనీలు ఇండియన్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజీల్లో పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయి.

ఏపీ, తెలంగాణలో ఇజ్రాయెల్‌ పాత్ర ఏమిటి?

ఇటీవల దావో్‌సలో ఏపీ సీఎం చంద్రబాబ మా ఆర్థిక మంత్రి నీర్‌ బర్కత్‌ను కలిసి ఏపీలో ఇజ్రాయిల్‌ పారిశ్రామిక పార్క్‌ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. నేను తెలంగాణలో పర్యటించాను. డీఆర్‌డీవోకు ఇజ్రాయెల్‌లోని సంబంధిత రక్షణ సాంకేతిక సంస్థకు సహకారంపై కసరత్తు జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి దావో్‌సలో ఇజ్రాయెల్‌ ఇన్నోవేషన్‌ అథారిటీతో ఏఐ, వ్యవసాయం, వాతావరణ మార్పులు, డీప్‌ టెక్‌ రంగాల్లో భాగస్వామ్యం గురించి మాట్లాడారు. ఇవి సఫలీకృతమవుతాయని ఆశిస్తున్నా.

Updated Date - Jan 29 , 2026 | 06:24 AM