స్టార్‌లింక్ సాయంతో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:01 AM
అమెరికన్ల ఇంటర్‌నెట్ సాయంతోనే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసినట్టు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని..
వాషింగ్టన్, నవంబరు 29: అమెరికన్ల ఇంటర్‌నెట్ సాయంతోనే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసినట్టు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అనధికారికంగా ఉపయోగించుకుందని వాషింగ్టన్ పోస్టు కథనం ప్రచురించింది. స్టార్‌లింక్ అధికారులను ఉటంకిస్తూ.. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖకు అందజేసిన రహస్య నివేదికలో కూడా ప్రస్తావించారని తెలిపింది. యుద్ధం తొలినాళ్లలో అమెరికా దాడులతో ఇరాన్‌కు చెందిన సంప్రదాయ సమాచార వ్యవస్థలు దెబ్బతిన్న సమయంలో స్టార్‌లింక్ ద్వారా సైనిక బలగాల మధ్య సమాచార మార్పిడి, ఆదేశాల జారీ, ఆత్మాహుతి డ్రోన్ల కార్యకలాపాలను పర్యవేక్షించిందని పేర్కొంది. ఈ విషయం తెలియడంతో స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఇద్దరు అధికారులను తొలగించారని వెల్లడించింది.