Share News

మళ్లీ యుద్ధంవైపు అడుగులు?

ABN , Publish Date - May 03 , 2026 | 04:15 AM

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగనున్నాయా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఆ దిశగా సాగుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి.

మళ్లీ యుద్ధంవైపు అడుగులు?

  • అమెరికా, ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత.. పిచ్చివాళ్ల వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్న ట్రంప్‌

  • సముద్రపు దొంగల్లా ఇరాన్‌ నౌకలను స్వాధీనం చేసుకుంటున్నామని వ్యాఖ్య

వాషింగ్టన్‌/టెహ్రాన్‌/దుబాయ్‌, మే 2: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగనున్నాయా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఆ దిశగా సాగుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి. యుద్ధం మళ్లీ మొదలయ్యేందుకు అవకాశం ఉందని, అందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఐఆర్‌జీసీ పేర్కొనడం.. ఇరాన్‌ పంపిన శాంతి ప్రతిపాదనలు తనకు నచ్చలేదని, ఒప్పందం కుదిరే అవకాశం కనిపించడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొనడం.. పైగా పిచ్చివాళ్ల వద్ద అణ్వస్త్రాలు ఉండొద్దనే వ్యాఖ్యలు.. పశ్చిమాసియాకు పెద్ద మొత్తంలో ఆయుధాల తరలింపు.. యుద్ధం మళ్లీ మొదలవుతుందంటూ ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ ప్రకటనలు వంటివన్నీ యుద్ధం వైపు సంకేతాలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇరాన్‌ మిలిటరీ ప్రధాన కార్యాలయం డిప్యూటీ చీఫ్‌ మొహమ్మద్‌ జఫార్‌ అసదీ ప్రకటించారు. శాంతి చర్చల కోసం ఇరాన్‌ చేసిన ప్రతిపాదనలను ట్రంప్‌ తిరస్కరించిన అనంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ‘‘దౌత్యపరమైన పరిష్కారంపై వారికి చిత్తశుద్ధి లేదు. మా సైన్యాలు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాయి. అమెరికన్లు ఏదైనా మూర్ఖపు చర్యకు పాల్పడితే దీటుగా బదులిస్తాం’’ అని జఫార్‌ అసదీ పేర్కొన్నారు.

ఇప్పుడు యుద్ధం ముగిస్తే.. మళ్లీ సమస్య

చర్చల కోసం ఇరాన్‌ పంపిన ప్రతిపాదనలు తనకే మాత్రం నచ్చలేదని ట్రంప్‌ అంతకుముందు పేర్కొన్నారు. తాను అంగీకరించే అవకాశమే లేని అంశాలను వారు ప్రతిపాదించారని చెప్పారు. పిచ్చివాళ్ల వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని, అందుకే ఇరాన్‌పై దాడులు చేశామని పేర్కొన్నారు.. తమ లక్ష్యాలు పూర్తికాకుండా యుద్ధం ముగిసిపోకూడదని, ఇప్పుడు గందరగోళంలో ముగిస్తే మరో మూడేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి సమస్యే తలెత్తుతుందని పేర్కొన్నారు. యుద్ధం మొదలుపెట్టిన 60 రోజుల్లోగా అధ్యక్షుడు చట్టసభ కాంగ్రెస్‌ ఆమోదం పొందాలన్న చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని విమర్శించారు. కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం నిలిచిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. హోర్ముజ్‌ దిగ్బంధంలో అమెరికా నావికాదళం సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తోందని ట్రంప్‌ అన్నారు. ‘‘మేం నౌకలపై దిగుతున్నాం. నౌకను, అందులోని సరుకులను, చమురును స్వాధీనం చేసుకుంటున్నాం. ఇది చాలా లాభదాయకంగా ఉంది. మేం సముద్రపు దొంగల తరహాలో వ్యవహరిస్తున్నాం. కానీ మేం ఆటలు ఆడటం లేదు’’ అన్నారు. ఇక తాము అనుకుంటే వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోగలమని ట్రంప్‌ పేర్కొన్నారు. క్యూబాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇరాన్‌కు ఫీజు కడితే ఆంక్షలు తప్పవు

ఇరాన్‌కు టోల్‌ ఫీజులు, ఇతర చార్జీలు కట్టి హోర్ముజ్‌ జలసంధి దాటే నౌకలు, సంబంధిత సంస్థలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా తాజాగా హెచ్చరించింది. ఇదిలా ఉండగా, ఇరాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్‌ వేసిన బాంబుల్లో కొన్ని పేలకుండా ఉండిపోయాయి. అలాంటి వాటిని ఐఆర్‌జీసీ బలగాలు గుర్తించి, నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. ఝాంజాన్‌ ప్రావిన్స్‌లో భారీ బాంబును నిర్వీర్యం చేస్తుండగా పేలిపోయి.. 14 మంది ఐఆర్‌జీసీ సైనికులు మృతిచెందారు.

స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ మూత

చమురు ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విమాన ఇంధనం ధరలు 80శాతానికిపైగా పెరిగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పలు విమానయాన సంస్థలు లాభదాయకం కాని సర్వీసులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. తాజాగా అమెరికాలోని చౌక విమానయాన సంస్థ ‘స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌’ సంస్థ పూర్తిగా తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసుల కుదింపు

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో పెరుగుతున్న చమురు ధరలకు తోడు గగనతల మూసివేతల ప్రభావంతో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై వరకూ తన అంతర్జాతీయ విమాన సర్వీసుల షెడ్యూల్‌ను కుదించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని మార్గాలకు విమానాలు నడపడం ఆర్థికంగా లాభదాయకం కాదని ఆ సంస్థ భావిస్తోంది. యుద్ధం కారణంగా విధించిన గగనతల ఆంక్షలతో ఎయిరిండియా పలు అంతర్జాతీయ సర్వీసుల మార్గాలను మార్చాల్చి వచ్చింది. దీంతో అప్పటివరకూ నేరుగా సాగిన ప్రయాణాలకు అదనపు దూరంతో పాటు ఇంధన వినియోగం పెరిగాయి. మరోవైపు జెట్‌ ఇంధనం ధరలు విపరీతంగా పెరగడంతో నిర్వహణ ఖర్చులూ భారంగా మారాయి.

Updated Date - May 03 , 2026 | 04:15 AM