2 రోజుల్లో మళ్లీ చర్చలు!
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:12 AM
అమెరికా-ఇరాన్ మధ్య మరో దఫా చర్చల కోసం రంగం సిద్ధమవుతోంది. లేదులేదంటూనే ఇరువర్గాలు కూడా సమావేశానికి సిద్ధమవుతున్నాయి.
ఇస్లామాబాద్ వేదికగానే ఇరాన్-అమెరికా శాంతి చర్చలు
ఆ దిశగానే ట్రంప్ సంకేతాలు
ఇంకా ధ్రువీకరించని ఇరాన్
ఏర్పాట్లు చేస్తున్న పాకిస్థాన్
హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న అమెరికా నిర్బంధం
ఇరాన్ పోర్టులకు సంబంధం లేని నౌకల రవాణాకు అనుమతి
పలు ఇరాన్ నౌకలు వెనక్కి!
హోర్ముజ్ స్వేచ్ఛగా ఉండాలి పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నుంచి ఉపశమనం తక్షణ అవసరం
ఫోన్ చర్చల్లో మోదీ, ట్రంప్
40 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు
వాషింగ్టన్/టెహ్రాన్/దుబాయ్, ఏప్రిల్ 14: అమెరికా-ఇరాన్ మధ్య మరో దఫా చర్చల కోసం రంగం సిద్ధమవుతోంది. లేదులేదంటూనే ఇరువర్గాలు కూడా సమావేశానికి సిద్ధమవుతున్నాయి. రెండు రోజుల్లో రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని, అదీ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగానే జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. శాంతి చర్చలు కొనసాగించేందుకు పాకిస్థాన్ అటు అమెరికాతో, ఇటు ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతూనే ఉందని, రెండో దఫాకు ఏర్పాట్లు కూడా చేస్తోందని పాక్ దౌత్యవర్గాలు వెల్లడించాయి. శాంతి చర్చల అంశంపై పాకిస్థాన్‌తో జరుగుతున్న సంప్రదింపులను ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ ధ్రువీకరించింది. అయితే రెండో దఫా చర్చల కోసం వెళ్లే అంశంపై ఇరాన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఈ వారం చివరిలో ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య మరో దఫా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా దౌత్యవర్గాలను ఉటంకిస్తూ.. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22వ తేదీన ముగియనుంది. ఆలోగానే రెండో దఫా చర్చలు జరిగి, ఏదో ఒక ఫలితం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇస్లామాబాద్‌లో తొలి దఫా శాంతి చర్చలు విఫలమైన తర్వాత.. తదుపరి చర్చలు స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా జరగవచ్చని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌లోనే రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ఇస్లామాబాద్ శాంతిచర్చల వైఫల్యం, తదుపరి చర్చలపై ప్రశ్నించగా.. ‘‘మీరు అక్కడే ఉండండి. నిజంగానే రెండు రోజుల్లో ఏదో పెద్ద అంశమే జరగబోతోంది. మేం అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది’’ అని ట్రంప్ చెప్పారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారంటూ ప్రశంసించారు. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన తొలిదఫా చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమం నిలిపివేతపై ఏకాభిప్రాయం వచ్చినా.. అది ఎన్నేళ్లపాటు అన్నదానిపై చిక్కుముడి పడిందని దౌత్యవర్గాలు తెలిపాయి. కనీసం 20 ఏళ్లపాటు అణు కార్యక్రమం నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేయగా.. ఐదేళ్లపాటు ఆపివేసేందుకు సిద్ధమని ఇరాన్ పేర్కొన్నదని వివరించాయి. ఇక ఇరాన్ శుద్ధి చేసిన 450 కిలోల యురేనియంను అప్పగించాలని అమెరికా కోరితే.. దాన్ని తక్కువ గాఢతకు మార్చి అణు రియాక్టర్లలో వినియోగించుకుంటామని ఇరాన్ పేర్కొందన్నాయి.
లెబనాన్ శాంతి చర్చలు ప్రారంభం!
లెబనాన్‌లో శాంతి నెలకొల్పేందుకు అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచీల్ లీటర్, లెబనాన్ రాయబారి నడా హమాదే మోవాద్, లెబనాన్‌లోని అమెరికా రాయబారి మైఖేల్ చర్చల్లో పాల్గొంటున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నిలిపివేత, హెజ్బొల్గా నిరాయుధీకరణపై చర్చలు జరుగుతున్నాయి.
ఇరాన్‌కు నష్టం రూ.25.12 లక్షల కోట్లు!
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌కు రూ.25.12 లక్షల కోట్ల (270 బిలియన్ డాలర్లు) నష్టం జరిగిందని ఆ దేశ ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా భారీ స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమే మొహజెరానీ ఈ వివరాలు వెల్లడించారు. ఈ నష్టానికి అమెరికా పరిహారం ఇవ్వాలని ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల్లో ఇరాన్ డిమాండ్ చేసినట్టు వెల్లడించారు.
హోర్ముజ్ దాటిన 5 నౌకలు!
అమెరికా దిగ్బంధం మధ్య మంగళవారం ఐదు చమురు ట్యాంకర్ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటాయి. నౌకల ట్రాకింగ్ సంస్థలు కెప్లర్, ఎల్‌ఎ్‌సఈజీ ఈ వివరాలను వెల్లడించాయి. ఈ నౌకల్లో రెండు అరేబియా సముద్రం నుంచి హోర్ముజ్ దాటి పర్షియన్ గల్ఫ్‌లోకి రాగా, మిగతా మూడు హోర్ముజ్‌ను దాటాయని తెలిపాయి. ఈ నౌకలన్నీ ఇంతకుముందు ఇంతకుముందు ఇరాన్, రష్యా చమురును సరఫరా చేసి.. అమెరికా ఆంక్షలకు గురైనవే కావడం గమనార్హం. ఇప్పుడు మాత్రం అవి ఇరాన్ పోర్టులకు కాకుండా గల్ఫ్‌లోని ఇతర దేశాలకు వెళుతున్నట్టు చూపడంతో అమెరికా దిగ్బంధం నుంచి తప్పించుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పనామా జెండాతో ఉన్న ‘పీస్ గల్ఫ్’ నౌక యూఏఈలోని హమ్రియా పోర్టుకు, మురళీకిషన్ నౌక ఇరాక్‌కు వెళుతున్నట్టుగా చూపుతూ హోర్ముజ్ దాటాయి. వీటిలో చైనా నుంచి వచ్చిన మురళీకిషన్ నౌక ఇరాన్‌కు చెందిన ఖెష్మ్ దీవి వైపు వెళుతున్నట్టు ట్రాకింగ్ సంస్థలు తెలిపాయి. ఇక దుబాయ్‌లోని షార్జా నుంచి బయలుదేరిన ‘రిచ్ స్టారీ’, ఇరాన్‌కు చెందిన బందర్ ఇమాన్ పోర్టు నుంచి బయలుదేరిన ‘క్రిస్టియానా’, ఇరాన్ బుషెహర్ పోర్టు నుంచి బయల్దేరిన ‘ఎల్పిస్’ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని దాటాయి. కాగా, హోర్ముజ్ దాటి వచ్చిన ఆరు ఇరాన్ సంబంధిత నౌకలను వెనక్కి తిప్పి పంపినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. పదుల కొద్దీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, 10 వేల మందికిపైగా సైన్యంతో దిగ్బంధాన్ని అమలు చేస్తున్నామని తెలిపింది.