నౌకకు 19 కోట్లు!
ABN , Publish Date - Apr 01 , 2026 | 03:57 AM
హోర్ముజ్ జలసంధిని దాటే నౌకల నుంచి అధికారికంగా చార్జీల వసూలుకు ఇరాన్ సిద్ధమైంది. జలసంధిలో నౌకల రాకపోకల పర్యవేక్షణ, ఫీజులు, అనుమతులు, నిషేధాలు తదితర అంశాలతో ప్రణాళికను సిద్ధం చేసింది.
హోర్ముజ్ దాటే చమురు నౌకలకు ఇరాన్ అధికారిక టోల్ ఫీజు
జలసంధి దాటేందుకు చార్జీల వసూలు
అదీ ఇరాన్ కరెన్సీలోనే చెల్లించేలా నిబంధనలు
అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై పూర్తి నిషేధం
నేటి నుంచి యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా సంస్థలపైనా దాడులు
18 అమెరికా కంపెనీలకు ఐఆర్‌జీసీ హెచ్చరిక
ఇస్ఫహాన్‌లో బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడిన అమెరికా
కీలకమైన అణు, రక్షణ కేంద్రాలకు నష్టం
భారీ పేలుళ్ల వీడియోను పోస్టు చేసిన ట్రంప్
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ముమ్మరం
దుబాయ్ తీరంలో కువైట్ చమురు నౌకకు మంటలు
దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ, మార్చి 31: హోర్ముజ్ జలసంధిని దాటే నౌకల నుంచి అధికారికంగా చార్జీల వసూలుకు ఇరాన్ సిద్ధమైంది. జలసంధిలో నౌకల రాకపోకల పర్యవేక్షణ, ఫీజులు, అనుమతులు, నిషేధాలు తదితర అంశాలతో ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికి ఇరాన్ పార్లమెంటు సెక్యూరిటీ కమిటీ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఐబీ ఈ వివరాలను వెల్లడించింది. ఆ ప్రణాళిక ప్రకారం.. జలసంధి మీదుగా అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన నౌకలతోపాటు ఇరాన్‌పై ఏకపక్షంగా ఆంక్షలు విధించిన దేశాల నౌకలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. జలసంధిపై ఇరాన్ సార్వభౌమత్వంతోపాటు మరోవైపున ఉన్న ఒమన్ సహకారంతో ఈ ప్రణాళిక అమలు, జలసంధి నిర్వహణ కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తుంది. జలసంధిని దాటేందుకు కట్టాల్సిన ఫీజును డాలర్లలో కాకుండా ఇరాన్‌కు చెందిన రియాల్ కరెన్సీలోనే చెల్లించాల్సి ఉంటుంది. అంటే డాలర్ ఆధారిత అమెరికా ఆంక్షలేవీ వర్తించవు. ఒక్కో నౌకపై రూ.19 కోట్ల (20 మిలియన్ డాలర్ల) వరకు ఫీజు వసూలు చేయనుంది. అయితే చమురు నౌకలు, కంటెయినర్ షిప్‌లు, బల్క్ క్యారియర్లకు వేర్వేరుగా ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక జలసంధిలో రక్షణ ఏర్పాట్లు, నౌకలకు భద్రత, పర్యావరణ పరమైన ఏర్పాట్లపైనా ఇరాన్ పలు నిబంధనలను రూపొందించింది.
ఇస్ఫహాన్‌లో తీవ్ర విధ్వంసం..
ఇరాన్‌పై అమెరికా భారీ స్థాయిలో విరుచుకుపడింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ అణు, క్షిపణి, ఆయుధ కేంద్రాలకు నిలయమైన ఇస్ఫహాన్ నగరంపై ఒక్కోటీ 900 కిలోలకు పైగా బరువుండే భారీ బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. భూగర్భంలోని క్షిపణి, ఆయుధ నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. భారీ స్థాయిలో పేలుళ్లతో, మంటలు ఎగిసిపడుతున్న వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్టు చేశారు. మరోవైపు టెహ్రాన్‌లోని కీలక ప్రాంతాలు, మెహ్రాబాద్ విమానాశ్రయం సమీపంలోనూ అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయి. ఇప్పటివరకు ఇరాన్‌లో 11 వేల లక్ష్యాలపై దాడి చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ డాన్ కెయిన్ ప్రకటించారు.
కువైట్ చమురు నౌకపై దాడి
సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈలపై ఇరాన్ దాడులు కొనసాగాయి. దుబాయ్ పోర్టులో ఉన్న కువైట్ చమురు నౌక అల్ సల్మీపై క్షిపణి దాడి జరిగింది. రెండు వందల కోట్ల బ్యారెళ్ల చమురుతో ఉన్న ఆ నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. దాని నుంచి చమురు లీక్ కావొచ్చన్న ఆందోళన వ్యక్తమైంది. కానీ చమురు లీక్ కావడం లేదని కువైట్ ప్రకటించింది. దుబాయ్‌లో, సౌదీలోని అల్ కర్జ్ ప్రాంతంలో క్షిపణుల శకలాలు పడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆరుగురు గాయపడ్డారు. ఇక గల్ఫ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఒక కంటెయినర్ షిప్‌పై క్షిపణి దాడి చేసినట్టు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. సెంట్రల్ ఇజ్రాయెల్‌లో జరిగిన క్షిపణి దాడుల్లో 11 మంది గాయపడ్డారు. టెల్ అవీవ్, బ్నేబ్రాక్, పెటా టిక్వా తదితర ప్రాంతాల్లో దాడులు జరిగాయి.
తౌఫిక్ దరౌ ఇంజనీరింగ్ రీసెర్చ్, కేన్సర్ మందులు తయారు చేసే ఫార్మాపై దాడులు జరిగాయని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఖెష్మ్ దీవి సమీపంలో కార్గో బోటుపై జరిగిన దాడిలో ఎనిమిది మంది ఇరానీలు మరణించారు. ఇక మహల్లత్ పట్టణంలో నివాస భవనాలపై జరిగిన క్షిపణి దాడిలో 11 మంది మరణించారని ఇస్నా వార్తా సంస్థ తెలిపింది.
అమెరికాకు చెందిన మరో ఎంక్యూ-9 డ్రోన్‌ను ఇస్ఫహాన్‌కు సమీపంలో కూల్చివేసినట్టు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఒక్కోటీ సుమారు రూ.280 కోట్లు (30 మిలియన్ డాలర్లు) విలువైన ఈ డ్రోన్లను ఇప్పటివరకు పన్నెండింటిని కూల్చినట్టు తెలిపింది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలోని ఇండోనేషియాకు చెందిన ముగ్గురు సైనికులు మృతిచెందారు. ఇప్పటివరకు 1,268 మంది ప్రజలు మరణించినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మంగళవారం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని, దౌత్య పరిష్కారంపై ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
చమురు ధరల భారం 10.4 లక్షల కోట్లు
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా పడిన అదనపు భారం సుమారు రూ.10.4 లక్షల కోట్లు (111 బిలియన్ డాలర్లు)గా పర్యావరణ సంస్థ 350డాట్ ఆర్గ్ అంచనా వేసింది. కేవలం నెల రోజుల్లోనే ప్రజలపై ఈ భారం పడిందని, మరోవైపు చమురు సంస్థలు అత్యంత భారీ లాభాలు ఆర్జించాయని పేర్కొంది. ప్రభుత్వాలు అప్పనంగా వచ్చిన ఈ లాభాలపై అదనపు పన్నులు వసూలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
నేటి నుంచి యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా సంస్థలపైనా దాడులు: ఐఆర్‌జీసీ
ఇరాన్‌పై అమెరికా దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికన్ సంస్థలన్నింటిపైనా బుధవారం ఉదయం 8 గంటల నుంచి భారీ స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. గ్లోబల్ సంస్థలైన డెల్ టెక్నాలజీస్, మైక్రోసాఫ్ట్, హెచ్‌పీ, సిస్కో, ఇంటెల్, ఒరాకిల్, యాపిల్, మెటా, ఐబీఎం, జేపీ మోర్గాన్ చేజ్, జనరల్ ఎలక్ట్రిక్, బోయింగ్ సహా 18 సంస్థల కార్యాలయాలు, ఆస్తులపై క్షిపణులు, డ్రోన్ల దాడులు చేస్తామని హెచ్చరించింది. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వెంటనే దూరంగా వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించింది. ఈ సంస్థలు, వాటి టెక్ సేవల సాయంతో అమెరికా మిలిటరీ ఇరాన్‌లో దాడులు చేస్తోందని ఆరోపించింది. ఇకపై ఆ సంస్థలన్నీ తమ లక్ష్యాల పరిధిలో ఉంటాయని పేర్కొంది.