Share News

హోర్ముజ్‌ను మూసేశాం

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:32 AM

అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఈ ఒప్పందాన్ని ప్రమాదంలో పడేశాయి.

హోర్ముజ్‌ను మూసేశాం

  • శాంతి ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినందుకే.. ఇరాన్‌ ఖతమ్‌ అల్‌ అన్బియా మిలిటరీ కమాండ్‌ ప్రకటన

  • జలసంధి తెరిచే ఉంది: అమెరికా

వాషింగ్టన్‌/ టెహ్రాన్‌, జూన్‌ 20: అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఈ ఒప్పందాన్ని ప్రమాదంలో పడేశాయి. ఇజ్రాయెల్‌ దాడులపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఇరాన్‌.. హోర్ముజ్‌ జలసంధిని మళ్లీ మూసేసినట్లు శనివారం ప్రకటించింది. ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ మేరకు ఇరాన్‌ అత్యున్నత స్థాయి జాయింట్‌ మిలిటరీ కమాండ్‌ ఖతమ్‌ అల్‌ అన్బియా ప్రకటన విడుదల చేసింది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా మొదటి చర్యగా హోర్ముజ్‌ జలసంధిని మూసేశామని, దాడులు అలాగే కొనసాగితే మరిన్ని ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే, జలసంధి తెరిచే ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రకటించారు. హోర్ముజ్‌లో నౌకలు వెళ్తున్నాయని, దానిని మూసివేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని శనివారం ఫాక్స్‌న్యూ్‌సకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఒప్పందాన్ని బలహీనపర్చేందుకు ఇజ్రాయెల్‌ యత్నం

సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) బలహీనపర్చేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తోందని అమెరికా నిఘా వర్గాలు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హెచ్చరించాయి. ఇరాన్‌కు కోపం తెప్పించి డీల్‌ నుంచి తప్పుకొనేలా చేసేందుకే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడుతోందని పేర్కొన్నాయి. ఈ ఏడాది చివరలో జరగబోయే ఇజ్రాయెల్‌ పార్లమెంటు ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకొనేందుకే ప్రధాని నెతన్యాహు ఈ దాడులు కొనసాగిస్తున్నారని నిఘా వర్గాలు ట్రంప్‌ ప్రభుత్వానికి నివేదించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ వార్తా సంస్థ పేర్కొంది. అయినా నెతన్యాహును ట్రంప్‌ ఆకాశానికి ఎత్తేశారు. శనివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నెతన్యాహు తనకు మంచి మిత్రుడని, ఆయన పోరాటయోధుడైన ప్రధాని అని కొనియాడారు. కాగా, పరిస్థితిని మళ్లీ గాడిలో పెట్టేందుకు మధ్యవర్తి పాకిస్థాన్‌ రంగంలోకి దిగింది. పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్‌ నఖ్వీ శనివారం ఇరాన్‌ వెళ్లారు. అక్కడ ఆయన తమ దేశ సీనియర్‌ నేతలతో చర్చలు జరపనున్నట్లు ఇరాన్‌ మీడియా సంస్థ ఇర్నా తెలిపింది. కాగా, శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్‌పై ట్రంప్‌ ప్రశంసల జల్లు కురిపిస్తుండగా, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మాత్రం విమర్శలు గుప్పించారు. ఓ పాడ్‌కా్‌స్టలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో మీడియా స్వేచ్ఛ శూన్యమని అన్నారు. అందుకే శాంతి ఒప్పంద పత్రం విడుదల ఆలస్యమైందని పేర్కొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 04:32 AM