Share News

పశ్చిమాసియాలో మళ్లీ అలజడి

ABN , Publish Date - Jul 30 , 2026 | 05:46 AM

మూడునాలుగు రోజులుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ అలజడి రేగింది. బుధవారం ఉదయం జోర్డాన్‌పై ఇరాన్‌ వరుసగా క్షిపణులను ప్రయోగించింది. తమ గగనతలంలోకి...

పశ్చిమాసియాలో మళ్లీ అలజడి

  • జోర్డాన్‌పై ఇరాన్‌ వరుసదాడులు

టెహ్రాన్‌, జూలై 29: మూడునాలుగు రోజులుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ అలజడి రేగింది. బుధవారం ఉదయం జోర్డాన్‌పై ఇరాన్‌ వరుసగా క్షిపణులను ప్రయోగించింది. తమ గగనతలంలోకి దూసుకొచ్చిన 5 ఇరాన్‌ క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్‌ మిలిటరీ ప్రకటించింది. ఇతర గల్ఫ్‌ దేశాల్లోని తమ మిలిటరీ స్థావరాలపై కూడా ఇరాన్‌ దాడులు చేసిందని, వాటిని తిప్పికొట్టినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. బుధవారం సాయంత్రం ఈజిప్టులోని డమియెట్టా పోర్టులో నిలిపి ఉంచిన అమెరికాకు చెందిన గ్యాస్‌ ట్యాంకర్‌ వెనెర్గోస్‌ వింటర్‌పై దాడి జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే నిలిపి ఉంచి గ్యాస్‌లాగ్‌ సాలెమ్‌ అనే మరో ట్యాంకర్‌కు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు తెలియరాలేదు. ఇరాన్‌ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌-అమెరికా, ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాలు మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల నుంచి రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌.. ఇటీవల కాస్పియన్‌ సముద్రంలో నౌకలపై దాడులు చేస్తోంది. ఆ దేశం జరిపిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ నౌక ధ్వంసంమైంది. ఒక నావికుడు కూడా మరణించాడు. దీనిపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. నల్లసముద్రంలోని ఉక్రెయిన్‌ పోర్టుపై దాడి చేసేందుకు ఇరాన్‌ ప్రణాళిక రచించిందని అమెరికా మీడియా పేర్కొంది. దీంతో ఈ ఘర్షణలు మరింత విస్తరించి చుట్టుపక్కల అన్ని దేశాలను అందులోకి లాగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 06:39 AM