యుద్ధమూ లేదూ.. ప్రశాంతతా లేదు: ఇరాన్
ABN , Publish Date - May 02 , 2026 | 08:48 PM
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి యుద్ధం లేదూ.. ప్రశాంతతా లేదూ అన్నట్టు ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ప్రస్తుతం యుద్ధం, ప్రశాంతత రెండూ లేని పరిస్థితి నెలకొందని భారత్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ అన్నారు. బెంగళూరులో శనివారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. ఇరాన్ ఈ యుద్ధాన్ని కోరుకోకపోయినా తమపై బలవంతంగా మోపారని చెప్పారు. ఈ యుద్ధాన్ని మొదలు పెట్టిన వారిపైనే ప్రస్తుతం ప్రపంచశాంతి సుస్థిరత ఆధారపడి ఉన్నాయని అన్నారు.
యుద్ధంతో తలెత్తిన అవస్థలు, ఇంధన కొరతతో సతమతం అవుతున్న దేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌పై యుద్ధం ముగింపు దిశగా ఎందుకు ఒత్తిడి తేవట్లేదని ప్రశ్నించారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో వేలమంది మరణించారని అన్నారు. ఇళ్లు, ఇతర మౌలిక వసతులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇంత నష్టం జరిగినా, లొంగిపోవాలని తమపై ఒత్తిడి పెరిగినా తాము తలొగ్గకుండా నిలబడ్డామని చెప్పారు. 40 రోజుల పాటు ఘర్షణలు జరిగినా లక్ష్యాలను చేరుకోకపోవడంతోనే అమెరికా, ఇజ్రాయెల్‌లు కాల్పుల విరమణకు దిగొచ్చాయని అన్నారు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ యుద్ధం, ప్రశాంతతా రెండూ లేని పరిస్థితి ఉందని అన్నారు.
10 వేల ఏళ్లుగా హోర్ముజ్ తెరిచే ఉందని కూడా ఆయన చెప్పారు. జలసంధి భద్రతకు తాము ఎంతో చేసే వాళ్లమని చెప్పారు. ప్రస్తుత అస్థిరతకు అమెరికా, ఇజ్రాయెల్‌లే కారణమని అన్నారు. తామే అత్యంత శక్తిమంతులమన్న భావన కలిగి ఉండటాన్ని ఆయన విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
యుద్ధం మళ్లీ మొదలు కావొచ్చు: ఇరాన్
60 రోజుల గడువు.. ఈ చట్టం అమెరికా అధ్యక్షుడిని ఆపగలదా..