అప్పటివరకూ హోర్ముజ్ బంద్.. ఇరాన్ స్పష్టీకరణ
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:58 PM
అమెరికా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ హోర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ హోర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు తమప్రభుత్వ నిర్ణయాన్ని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ ముహమ్మద్ బాఘెర్ గాలిబఫ్ స్పష్టం చేశారు. గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అనుసరించి యూఎస్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. పార్లమెంటును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తాము చెప్పదలుచుకున్నది స్పష్టంగా అమెరికాకు మధ్యవర్తుల ద్వారా చేరవేశామని చెప్పారు. ‘మోసం, ఏకపక్ష ధోరణులకు కాలం చెల్లిందని శత్రువుకు అర్థమైపోయింది. కాబట్టి, మాకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండే వరకూ, ఇరాన్ హక్కులను గుర్తించే వరకూ హోర్ముజ్ మూసే ఉంటుంది. చర్చలకూ అవకాశం ఉండదు’ అని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ అమెరికా ముందు పలు డిమాండ్స్ పెట్టింది. ఇరాన్ పోర్టుల చుట్టూ దిగ్బంధనం తొలగింపు, ఆంక్షల ఎత్తివేత, విదేశాల్లోని ఇరాన్ ఆస్తుల విడుదల, ఇరాన్‌పై బెదిరింపులకు ముగింపు పలకడం, అన్ని రకాల మిలిటరీ చర్యలను కట్టిపెట్టడంపై జూన్‌లో ఒప్పందం ప్రకారం మాట నిలబెట్టుకోవాలని యూఎస్‌ను డిమాండ్ చేసింది.
అణుకార్యక్రమం సహా పలు అంశాలపై కూలంకషంగా చర్చించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య జూన్‌లో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరు దేశాలు ఒప్పందానికి అంగీకరించాయి. ఆ తరువాత 60 రోజుల్లో పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే, హోర్ముజ్‌పై భేదాభిప్రాయాల నేపథ్యంలో ఒప్పందం కథ ముగిసినట్టేనని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జులై 7న ప్రకటించారు. ఒప్పందాన్ని పక్కన పెట్టేసినట్టు ఆ మరుసటి వారం ఇరాన్ కూడా ప్రకటించింది. ఆ తరువాత ఇరాన్, అమెరికాలు పరస్పర దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పతాకస్థాయికి చేరుకున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యం ముగిసింది: ఇరాన్ స్పీకర్
ఏఐకి కొత్త పేరు పెట్టండి.. ప్రజలకు ట్రంప్ పోలింగ్