తెరుచుకున్న హోర్ముజ్
ABN , Publish Date - Apr 18 , 2026 | 05:25 AM
ప్రపంచానికి ఇరాన్ శుభవార్త చెప్పింది. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండటం...
నౌకల రవాణాకు పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటన
టెహ్రాన్, ఏప్రిల్ 17: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త చెప్పింది. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండటం, అటు ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య కూడా గురువారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినందున వాణిజ్య నౌకల రాకపోకల కోసం హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నాం. కాల్పుల విరమణ కొనసాగినంతకాలం ఇది అమల్లో ఉంటుంది. ఇరాన్ నౌకాయాన విభాగం ఇప్పటికే సూచించిన మార్గంలో వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించాలి’ అని సూచించారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇప్పుడే పూర్తిగా తెరిచింది. ఇక ఆ మార్గంలో నౌకలు స్వేచ్ఛగా వెళ్తాయి. ఇరాన్‌కు ధన్యవాదాలు’ అని ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. అయితే, ఇరాన్ పోర్టుల నుంచి వచ్చే నౌకల నిర్బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇరాన్‌కు చెందిన 19 నౌకలను శుక్రవారం తిప్పి పంపినట్లు అమెరికా నౌకాదళం ప్రకటించింది. హోర్ముజ్ జలసంధిని తెరవటాన్ని బ్రిటన్, ఫ్రాన్స్‌లు స్వాగతించాయి. అయితే, అది శాశ్వతంగా తెరిచి ఉంచాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ డిమాండ్ చేశారు. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించేందుకు ప్యారి్‌సలో దాదాపు 50 దేశాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధిని భేషరతుగా తెరిచి ఉంచాలని డిమాండ్ చేశారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. త్వరలో రెండో దఫా చర్చలు ఉంటాయని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ గురువారం ఇరాన్‌కు వెళ్లి.. ఆ దేశ నేతలతో చర్చలు జరిపారు. ఆ మరుసటి రోజే జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించటం గమనార్హం. కాగా, ఇటు ఇరాన్‌తో, అటు లెబనాన్‌తో ఘర్షణ తాత్కాలికంగా ఆగిపోవటంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశంలో ఎమర్జెన్సీని శుక్రవారం ఎత్తివేసింది.
10శాతం పడిపోయిన ముడి చమురు ధరలు
ఇరాన్ ప్రకటన వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 10.73 శాతం కుంగి 88.73 డాలర్లకు చేరింది. అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్ ట్రేడింగ్‌లో బ్యారెల్‌కు 10.82 శాతం తగ్గి 84.44 డాలర్లకు చేరింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం హోర్ముజ్ జలసంధి నుంచే వెళ్తోంది. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడి చేయటంతో మార్చి 2 నుంచి ఈ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. దీంతో చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి ముడి చమురు ధరలు ఏకంగా 30 శాతం పెరిగాయి. భారత్ కూడా ఈ మార్గం ద్వారానే ఎక్కువగా చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులు మందగించటంతో దేశంలో గత నెలలో గ్యాస్ కొరత ఏర్పడింది. మనదేశంలో వంటగ్యాస్ బుకింగ్‌లు మామూలసమయంలో రోజుకు 45 లక్షల వరకు ఉండగా, కొరత భయాలతో మార్చిలో రోజుకు బుకింగ్‌లు 88 లక్షలకు చేరాయి. ప్రస్తుతం పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరింది. రోజువారీ బుకింగ్‌లు 50 లక్షలకు మించటం లేదు. తాజాగా జలసంధిని తెరవటంతో భారత్‌కు భారీ ఊరట లభించినట్లయ్యింది
ట్రంప్‌వన్నీ అబద్ధాలే: ఇరాన్
యురేనియం నిల్వలను అప్పగించడానికి తాను అంగీకరించినట్టు ట్రంప్ చెప్పడాన్ని ఇరాన్ తప్పుబట్టింది. ట్రంప్‌వన్నీ అబద్ధాలంటూ మండిపడింది. ఆ అంశంపై కనీసం సంప్రదింపులు కూడా జరగలేదని వివరణ ఇచ్చింది. అణ్వాయుధ పరికరాల బదిలీ అంశం ఏ రూపంలోను చర్చకు రాలేదని ఇరాన్ స్పీకర్ బఘేర్ గాలీబ్‌ఫకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తొలి విడత చర్చలకు గాలీబఫ్ ప్రాతినిథ్యం వహించారు. ట్రంప్ చెబుతున్నట్టు.. చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఆయన చెప్పిన మరో అబద్ధం ఇదని మండిపడింది.