Share News

బ్రిక్స్ సమ్మిట్.. భారత్‌కు రానున్న ఇరాన్ విదేశాంగ మంత్రి

ABN , Publish Date - May 11 , 2026 | 02:14 PM

బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు త్వరలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ భారత్‌కు రానున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

బ్రిక్స్ సమ్మిట్.. భారత్‌కు రానున్న ఇరాన్ విదేశాంగ మంత్రి
Abbas Araghchi

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ త్వరలో భారత్‌కు రానున్నారు. మే 14-15 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రానున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2024లో ఇరాన్ బ్రిక్స్ కూటమిలో చేరింది. ఇరాన్‌తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు బ్రిక్స్ సభ్యత్వాన్ని తీసుకున్నాయి. బ్రిక్స్ సమావేశాల కోసం ఇరాన్ విదేశాంగ శాఖ సహాయమంత్రి కాజిమ్ ఘరీబాబాదీ కూడా రావొచ్చని తెలుస్తోంది.


ఈ ఏడాది జనవరిలో భారత్ బ్రిక్స్ కూటమి చైర్మన్‌షిప్ బాధ్యతలను స్వీకరించింది. అంతకుముందు బ్రెజిల్ ఈ బాధ్యతలను నిర్వహించింది. బ్రిక్స్ కూటమికి సారథ్యం వహించడం భారత్‌కు ఇది నాల్గవ సారి. 2012, 2016, 2021 నాటి బ్రిక్స్ సమావేశాలకు భారత్ ఆతిథ్యమిచ్చింది. బ్రిక్స్ సమావేశాలకు తమ తరఫున విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ హాజరవుతారని రష్యా ఏప్రిల్ 29న తెలిపింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలపై చర్చించేందుకు ఇది ఉపయుక్తమైన వేదిక అని అప్పట్లో రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాల బలోపేతానికి ప్రయత్నిస్తామని కూడా పేర్కొన్నారు. బ్రిక్స్ కూటమిలో ప్రస్తుతం భారత్ సహా 9 సభ్య దేశాలు ఉన్నాయి.


ఈ వార్తనూ చదవండి:

ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన హెజ్‌బొల్లా.. ఐరన్ డోమ్ యూనిట్ ధ్వంసం

భారత్‌కు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్

Updated Date - May 11 , 2026 | 02:24 PM