Share News

అమెరికాకు ఇరాన్‌ షరతులు!

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:03 AM

పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకాలంటే, అమెరికా తాను సృష్టించుకున్న చిక్కుల్లోంచి బయటపడాలంటే.. తమ ఏడు షరతులకు అంగీకరించాలని ఇరాన్‌ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో అమెరికా, దాని మిత్రపక్షాలు చేస్తున్న అన్నిరకాల దాడులను నిలిపివేయాలని పేర్కొంది.

అమెరికాకు  ఇరాన్‌ షరతులు!
AMERICAand iran Flags

  • చిక్కుల్లోంచి బయటపడాలంటే

వాటికి అంగీకరించాల్సిందే

  • అలాగైతేనే పశ్చిమాసియాలో

యుద్ధానికి ముగింపు

  • ట్రంప్‌ బెదిరింపులతో

ఫలితం ఉండదు: ఇరాన్‌

  • మళ్లీ విమానాల రద్దుకు చాన్స్‌

  • అప్రమత్తంగా ఉండండి

  • ఆయా దేశాల్లోని తమ

పౌరులకు అమెరికా హెచ్చరిక

  • యూకే నుంచి పశ్చిమాసియా

వైపు అమెరికా బీ1బీ బాంబర్‌!

  • చిక్కుల్లోంచి బయటపడాలంటే వీటికి అంగీకరించాలి.. అలాగైతేనే యుద్ధానికి ముగింపు:

ఇరాన్‌దుబాయ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకాలంటే, అమెరికా తాను సృష్టించుకున్న చిక్కుల్లోంచి బయటపడాలంటే.. తమ ఏడు షరతులకు అంగీకరించాలని ఇరాన్‌ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో అమెరికా, దాని మిత్రపక్షాలు చేస్తున్న అన్నిరకాల దాడులను నిలిపివేయాలని పేర్కొంది. ఈ మేరకు ఖతార్‌ మధ్యవర్తిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సమాచారం అందజేసింది. ఇక పశ్చిమాసియా దేశాల్లోని తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. దాడులు, ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చని, విమానాల రద్దు వంటివి జరగవచ్చని పేర్కొంది. మరోవైపు అమెరికాలో క్యాంప్‌ డేవిడ్‌ పర్యటనలో ఉన్న అధ్యక్షుడు ట్రంప్‌.. అర్ధంతరంగా తన పర్యటన ముగించుకుని వైట్‌హౌస్‌కు వెళ్లిపోయారు. సౌదీ అరేబియాపై హుతీల దాడులతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితి నెలకొన్న సమయంలో ఈ పరిణామాలు జరగడం గమనార్హం.

ట్రంప్‌ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం

పశ్చిమాసియాలో యుద్ధం ముగింపునకు సంబంధించి ఏడు షరతులను అమెరికాకు పంపామని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధిపతి మొహ్సెన్‌ రెజాయి వెల్లడించారు. పశ్చిమాసియాలో సౌదీ, హుతీల మధ్య దాడులు సహా అన్నిచోట్ల యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులన్నింటినీ విడుదల చేయాలని, హోర్ము జ్‌ అవతల అమెరికా నౌకా దిగ్బంధాన్ని ఎత్తివేయాలనే అంశాలు షరతుల్లో ఉన్నట్టు వివరించారు. ‘‘యుద్ధం ముగింపు, చర్చల కోసం ఏడు షరతులను మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌ ద్వారా అమెరికా ప్రభుత్వానికి తెలియజేశాం. దీనిపై ట్రంప్‌ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నాం.


అమెరికా తాను సృష్టించుకున్న చిక్కుల నుంచి బయటపడాలంటే, ఇందులో మరింతగా కూరుకుపోకుండా ఉండాలంటే.. ఇరాన్‌ షరతులను అంగీకరించడం తప్ప మరో మార్గం లేదు. షరతులను అంగీకరించడం అమెరికాకే ప్రయోజనకరం. ట్రంప్‌ బెదిరింపులతో ఎలాంటి ఫలితం ఉండదు. అవసరమైతే నిర్ణయాత్మక యుద్ధానికి ఇరాన్‌ సిద్ధంగా ఉంది’’ అని రెజాయి స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనాలు ఉన్నాయని, కానీ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలన్న లక్ష్యంతో కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇక తమ షరతులకు అమెరికా అంగీకరించే వరకు హోర్ముజ్‌ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ బఘర్‌ ఘలీబఫ్‌ ప్రకటించారు.

పశ్చిమాసియాలో అప్రమత్తం: అమెరికా

సౌదీ అరేబియాపై యెమెన్‌ హుతీల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని అమెరికా పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోని అమెరికా పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ‘‘బహ్రెయిన్‌, ఇరాన్‌, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, వెస్ట్‌బ్యాంక్‌, గాజా, జోర్డాన్‌, కువైట్‌, లెబనాన్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈలకు ప్రయాణాలు చేయవద్దు. ఇప్పటికే అక్కడ ఉన్నవారు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. అ మెరికా దౌత్యకార్యాలయాలు, అమెరికాతో సంబంధం ఉన్న సంస్థలు, ప్రజలపై ఇరాన్‌ అనుకూల హుతీలు, ఇతర సంస్థలు దాడులు చేయవచ్చు. పశ్చిమాసియాలో గగనతలం మూసివేతలు, విమానాల రద్దు వంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది’’ అని పేర్కొంది. ఇక యూకేలోని అమెరికాకు చెందిన ఆర్‌ఏఎఫ్‌ ఫెయిర్‌ఫోర్డ్‌ సైనిక స్థావరం నుంచి భారీ బీ1బీ బాంబర్‌ విమానం పశ్చిమాసియా వైపు బయలుదేరినట్టు కథనాలు వెలువడ్డాయి. ఇరాన్‌ షరతులు, సౌదీపై హుతీల దాడుల నేపథ్యంలో ఈ పరిణామలు ఆసక్తికరంగా మారాయి.


సౌదీపై ఆగని హుతీల దాడులు

సౌదీ అరేబియాపై యెమెన్‌ హుతీల దాడులు కొనసాగుతున్నాయి. హుతీలు ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణి దాడిలో సౌదీ రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుళ్లు జరిగి, భారీగా మంటలు చెలరేగాయి. యన్బు ప్రాంతంలోని చమురు మౌలిక సదుపాయాలపైనా దాడులు జరిగాయి. అయితే హుతీలు ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నామని సౌదీ ప్రకటించింది.

Updated Date - Sep 21 , 2026 | 04:03 AM