హోర్ముజ్ మళ్లీ మూత
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:01 AM
నాలుగు నెలల సంక్షోభం తర్వాత నాలుగు రోజుల క్రితమే తెరుచుకున్న హోర్ముజ్ జలసంధి మళ్లీ మూతపడింది. చమురు కష్టాలు తీరబోతున్నాయని ప్రపంచం ఊపిరి పీల్చుకునేలోపే తిరిగి మొదలయ్యాయి.
ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా జలసంధిని మూసేసిన ఇరాన్
ఇరాన్ చర్యను ధ్రువీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
దాడులు ఆపకపోతే ఇరాన్‌ను లేకుండా చేస్తామని హెచ్చరిక
హోర్ముజ్ జలసంధిలో తామే టోల్ వసూలు చేస్తామని ప్రకటన
ప్రపంచానికి మళ్లీ చమురు కష్టాలు?
హోర్ముజ్ బంద్‌కు ట్రంపే కారణం: జర్మనీ
స్విట్జర్లాండ్‌లో చర్చలు.. ఇరాన్ వాకౌట్
వాషింగ్టన్/ టెహ్రాన్, జూన్ 21: నాలుగు నెలల సంక్షోభం తర్వాత నాలుగు రోజుల క్రితమే తెరుచుకున్న హోర్ముజ్ జలసంధి మళ్లీ మూతపడింది. చమురు కష్టాలు తీరబోతున్నాయని ప్రపంచం ఊపిరి పీల్చుకునేలోపే తిరిగి మొదలయ్యాయి. సుదీర్ఘ చర్చల తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో ఈ నెల 17వ తేదీనే జలసంధిని ఇరాన్ తెరిచింది. యుద్ధం వల్ల దాదాపు 110 రోజులపాటు పర్షియన్ గల్ఫ్‌లోనే నిలిచిపోయిన చమురు నౌకలు మెల్లగా గమ్యంవైపు కదిలాయి. కొన్ని నౌకలు జలసంధిని దాటాయి. అంతలోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయటంతో ఆగ్రహించిన ఇరాన్ జలసంధిని శనివారం మూసివేసింది. అయితే, జలసంధి తెరిచే ఉందని శనివారం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆదివారం అది మూతపడిందని పరోక్షంగా ఒప్పుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపించారు. పశ్చిమాసియాలో తన మిలీషియా గ్రూపుల ద్వారా దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆయన ఆదివారం పోస్టు పెట్టారు. ‘ఇరాన్ తన మిలీషియా గ్రూపులతో దాడులకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఎంవోయూ ప్రకారం 60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందం కుదరకపోయినా, ఇరాన్ ఈ పరోక్ష దాడులు ఆపకపోయినా ఆ దేశంపై గతంకంటే భీకరంగా దాడులు చేస్తాం. ఇరాన్ అనే దేశమే లేకుండా చేస్తాం’ అని హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధి ఎప్పటికీ స్వేచ్ఛాయుత వాణిజ్య రవాణా మార్గంగా ఉంటుందని చెప్తూ వచ్చిన ట్రంప్.. తాజాగా మాట మార్చారు. జలసంధిలో తామే టోల్ వసూలు చేస్తామని ప్రకటించారు. ‘ఈ 60 రోజులు జలసంధిలో ఎలాంటి టోల్ ఫీజు ఉండదు. 60 రోజుల్లో ఇరాన్ మాతో శాశ్వత శాంతి సంధి కుదుర్చుకుంటే ఆ తర్వాత కూడా టోల్ వసూలు ఉండదు. కానీ, శాంతి ఒప్పందం కుదరకపోతే మాత్రం మేమే టోల్ ఫీజు వసూలు చేస్తాం. పర్షియన్ గల్ఫ్‌లోని దేశాల రక్షణకు గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో మేము చేసిన, చేసే వ్యయాలకు గాను ఆ దేశాలు రక్షణ పన్ను చెల్లించాల్సిందే. అందుకోసం మేమే హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల నుంచి టోల్ వసూలు చేస్తాం’ అని ప్రకటించారు. అయితే, జలసంధి మళ్లీ మూతపడటానికి ట్రంపే కారణమని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ ఆరోపించారు.

చర్చలు మొదలు.. ఇరాన్ వాకౌంట్
ఇరాన్-అమెరికా మధ్య స్విట్జర్లాండ్‌లో ఆదివారం చర్చలు ప్రారంభమయ్యాయి. గత శుక్రవారమే జరగాల్సిన ఈ చర్చలు.. వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజా చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహించగా, ఇరాన్ బృందానికి ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వం వహించారు. మధ్యవర్తులుగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్, ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహీమ్ బిన్ జస్సిమ్ అల్ తానీ పాల్గొన్నారు. ఈ చర్చలు ఎడమొహం పెడమొహంగానే మొదలయ్యాయని సమాచారం. చర్చలకు ముందు అమెరికా ప్రతినిధులతో కరచాలనం చేసేందుకు, గ్రూప్ ఫొటో దిగేందుకు ఇరాన్ ప్రతినిధులు ఒప్పుకోలేదని అల్‌జజీరా వార్తా సంస్థ పేర్కొంది. ఈ చర్చల్లో కూడా ట్రంప్ చిచ్చుపెట్టారు. చర్చలు మొదలు కాగానే ఆయన ఇరాన్ దేశాన్నే లేకుండా చేస్తామని సోషల్‌మీడియా వేదికగా హెచ్చరించారు. దీంతో ఇరాన్ ప్రతినిధులు నిరసన వ్యక్తంచేస్తూ వాకౌట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ పార్లమెంటు స్పీకర్ గలిభాఫ్ హెచ్చరించారు. అయితే, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జేడీ వాన్స్.. చర్చలు ఫలవంతంగా సాగాయని చెప్పారు. ఇరాన్‌తో పరిణామాత్మక దౌత్య సంబంధాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తన జీవితంలో భారత, పాకిస్థానీలు ఇద్దరు అత్యంత ముఖ్యమైన వ్యక్తులని పేర్కొన్నారు. భారతీయురాలు తన సతీమణి ఉష అయితే, పాకిస్థానీ.. ఆ దేశ సైన్యాధ్యక్షుడని తెలిపారు.