Share News

జైలుకు వెళ్లాల్సి వస్తుందనే సీజ్‌ఫైర్‌ను అడ్డుకునే యత్నం

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:23 AM

కాల్పుల విరమణ కుదిరితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అడ్డుకోవాలని చూస్తున్నారని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఆరోపించారు.

జైలుకు వెళ్లాల్సి వస్తుందనే సీజ్‌ఫైర్‌ను అడ్డుకునే యత్నం

  • నెతన్యాహు ప్రయత్నాలకు లొంగిపోతే అమెరికా తీవ్రంగా నష్టపోతుంది

  • దేనికైనా మేం సిద్ధంగానే ఉన్నాం

  • అమెరికా ఏదో ఒకటి ఎంచుకోవాలి: అబ్బాస్‌ అరాగ్చీ

టెహ్రాన్‌, ఏప్రిల్‌ 9: కాల్పుల విరమణ కుదిరితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అడ్డుకోవాలని చూస్తున్నారని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఆరోపించారు. అవినీతి కేసులో నెతన్యాహు ఆదివారం విచారణ ఎదుర్కోనున్నారని గుర్తు చేశారు. ‘‘కాల్పుల విరమణ జరిగితే నెతన్యాహు జైలుకు వెళ్లాల్సి వస్తుందని నెతన్యాహు భావిస్తున్నారు. అందుకే యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇందుకు అమెరికా లొంగిపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. దౌత్యప్రక్రియ కొనసాగించాలా లేదా అన్నది వారి ఇష్టం. కానీ కొనసాగించకపోతే అమెరికాది మూర్ఖత్వం అవుతుంది. దానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం..’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇక ఇజ్రాయెల్‌ ద్వారా అమెరికా పరోక్ష యుద్ధం కొనసాగించడమా? పూర్తిస్థాయి కాల్పుల విరమణా? అమెరికా ఏదో ఒకటి ఎంచుకోవాలని అరాగ్చీ సూచించారు. రెండూ ఒకేసారి కొనసాగలేవని స్పష్టం చేశారు. లెబనాన్‌లో జరుగుతున్న మారణకాండను ప్రపంచం మొత్తం చూస్తోందని.. అమెరికా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా? లేదా అని ప్రపంచం చూస్తోందని పేర్కొన్నారు.

పశ్చిమాసియాలో ఆగిన దాడులు!

కాల్పుల విరమణ ఒప్పందం మేరకు పశ్చిమాసియాలో దాడులు నిలిచిపోయాయి. అటు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌.. ఇటు గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులను పూర్తిగా నిలిపివేశాయి. విరమణను ప్రకటించిన బుధవారం పలు క్షిపణులు, డ్రోన్లు దూసుకువచ్చినా.. గురువారం మాత్రం ఎలాంటి దాడులూ జరగలేదని సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖతార్‌, ఒమన్‌, బహ్రెయిన్‌ దేశాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇలా పూర్తిస్థాయిలో దాడులు జరగకుండా ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. యుద్ధంలో మొత్తంగా ఇప్పటివరకు 537 బాలిస్టిక్‌ క్షిపణులు, 26 క్రూయిజ్‌ క్షిపణులు, 2,256 డ్రోన్లు తమపైకి దూసుకువచ్చాయని యూఏఈ ప్రకటించింది. కాగా, అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో తొలిరోజునే మృతిచెందిన సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీకి ఇరాన్‌ గురువారం ఘనంగా నివాళులు అర్పించింది. ఇరాన్‌లో మృతుల సంఖ్య 3 వేలు దాటినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Updated Date - Apr 10 , 2026 | 03:23 AM