Share News

గల్ఫ్‌ దేశాల్లో గణనాథుడి ఉత్సవాలు

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:57 AM

వినాయక చవితి సందర్భంగా గల్ఫ్‌ దేశాల్లోని తెలుగు ప్రవాసీయులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. సాధారణంగా భారత్‌లో గణేశుడిని తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి నిమజ్జనం చేయడం ఆనవాయితీ.

గల్ఫ్‌ దేశాల్లో గణనాథుడి ఉత్సవాలు
gulf ganesh festival

  • పరదేశంలో భక్తి పారవశ్యంతో గణేశ్‌ నిమజ్జనాలు.. సౌదీ, ఒమాన్‌, దుబాయ్‌లలో తెలుగు ప్రవాసీయుల సందడి

  • లేబర్‌ క్యాంపుల్లో విశేష పూజలు..

  • ఘనంగా అన్నదాన కార్యక్రమాలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

వినాయక చవితి సందర్భంగా గల్ఫ్‌ దేశాల్లోని తెలుగు ప్రవాసీయులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. సాధారణంగా భారత్‌లో గణేశుడిని తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అయితే, గల్ఫ్‌ దేశాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అత్యధికులు ఒకటి, రెండు రోజుల్లోనే నిమ్జజన ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. దుబాయ్‌లోని కొన్నిచోట్ల మాత్రం 9, 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరమే విఘ్నేశ్వరుడికి వీడ్కోలు పలకనున్నారు. గల్ఫ్‌లో సెలవు దినాలయిన శుక్ర, శనివారాల్లో గణేశ్‌ విగ్రహా ల నిమజ్జనాలు పూర్తికాగా, దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం నిమజ్జనం చేశారు.

సౌదీ అరేబియా, దుబాయ్‌లో వైభవంగా..

సౌదీ అరేబియాలోని రియాద్‌, దమ్మాం నగరాల్లో వందలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని నిమజ్జనం చేశారు. దమ్మాంలో తెలుగు ప్రవాసీ ప్రముఖుడు తేజ అధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే రియాద్‌లో రంజిత్‌ చెట్లూరి నేతృత్వంలో తెలుగు కుటుంబాలు వినాయక చవితి వేడుకలను అత్యంత నిష్టతో నిర్వహించాయి. దుబాయ్‌లోని లేబర్‌ క్యాంపులు, అపార్ట్‌మెంట్లలో ప్రతిష్ఠించిన గణపతికి పూజల అనంతరం శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం నిమజ్జనం చేశారు. రాస్‌ అల్‌ ఖైమాలోని మైత్రీ ఫాం (కేసరి)లో ప్రతిష్ఠించిన వినాయకుడిని దర్శించుకునేందుకు ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం నిమజ్జనం చేశారు. జబల్‌ అలీలోని హిందూ మందిరంలో మాత్రం పూజలు కొనసాగుతున్నాయి.


ఒమాన్‌, బహ్రెయిన్‌లలో ఉత్సాహంగా..

ఒమాన్‌లోని శ్రీకృష్ణ, శివాలయాలలో గుజరాతీలు, కన్నడిగులు నిర్వహించిన ఉత్సవాలలో తెలుగు ప్ర వాసీయులు విశేషంగా పాల్గొన్నారు. మస్కట్‌లోని బర్కా, వాదీ కబీర్‌, మోబిల్ల, అజిబా, మిస్ఫా మునిసిపాలిటీల్లో పనిచేసే తెలుగు కార్మికులు తమ క్యాంపుల్లో శుక్రవారం చవితి ఉత్సవాలను జరుపుకొన్నారు. బహ్రెయిన్‌లో ఈసారి ఉత్సవాలు మరింత వైభవంగా సాగాయి. తెలుగు కళా సమితి, పద్మశాలీ సంఘంతో పాటు వివిధ సంస్థల క్యాంపుల్లో ప్రవాసీయులు పూజలు నిర్వహించారు.

Updated Date - Sep 21 , 2026 | 04:57 AM