ట్రంప్ ఇంటి పరిసరాల్లోకి తుపాకీతో ఎంట్రీ! యువకుడి కాల్చివేత
ABN , Publish Date - Feb 23 , 2026 | 09:02 AM
ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో పరిసరాల్లోకి చొరబడిన ఓ యువకుడిని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్చి చంపారు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లోరిడాలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో ఎస్టేట్ పరిసరాల్లోకి చొరబడిన యువకుడు ఆదివారం సెక్యూరిటీ సిబ్బంది కాల్పుల్లో మరణించాడు. ఘటన జరిగిన సమయంలో ట్రంప్ అక్కడ లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. యువకుడి కాల్చివేతను యూఎస్ సీక్రెట్ సర్వీస్ విభాగం ప్రతినిధి ఆంథొనీ ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు. నిందితుడు తుపాకీతో ట్రంప్ ఇంటి పరిసరాల్లోకి అక్రమంగా ప్రవేశించాడని అన్నారు. తుపాకీతో పాటు అతడి వద్ద ఇంధనం ఉన్న డబ్బా కూడా ఉందని తెలిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి ఎలాంటి అపాయం కలుగలేదని కూడా చెప్పారు (Mar- a-Lago intruder shot Dead). యువకుడి ఉద్దేశం ఏమిటో, అతడు ట్రంప్ నివాస పరిసరాల్లోకి ఎందుకు చొరబడ్డాడో తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారాంతాల్లో మార్-ఏ-లాగో ఎస్టేట్‌లో బస చేసే విషయం తెలిసిందే.
ట్రంప్‌పై గతంలో కూడా అనేక హత్యా యత్నాలు జరిగాయి. అధ్యక్షుడి హత్యాయత్నానికి ప్లాన్ చేసిన రయాన్ రూత్ అనే వ్యక్తికి ఈ నెల మొదట్లో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2024 సెప్టెంబర్‌లో ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్స్‌లో ట్రంప్‌ను హత్య చేసేందుకు అతడు కుట్ర పన్నినట్టు అధికారులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అంతకు రెండు నెలల ముందు మ్యాథ్యూ క్రుక్స్ అనే యువకుడు ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తూటా ట్రంప్ చెవికి మాత్రమే తగులుతూ వెళ్లడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. పోలీసుల కాల్పుల్లో క్రుక్స్ మరణించాడు. ఇక ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి ఈ ఘటనలో కన్నుమూశారు.
ఈ వార్తలనూ చదవండి:
అఫ్గానిస్థాన్‌లో పాక్ వైమానిక దాడులు
సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్‌నకు అమెరికన్ల డిమాండ్