రష్యా రిఫైనరీ, ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ దాడి
ABN , Publish Date - Jul 12 , 2026 | 04:54 PM
రష్యాపై ఉక్రెయిన్ మరోసారి దాడులు చేసింది. సమారా ప్రాంతంతో పాటు అజోవ్-బ్లాక్ సీ కెనాల్‌పై ఆదివారం దాడులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యాపై ఉక్రెయిన్ మరోసారి దాడులు చేసింది. సమారా ప్రాంతంతో పాటు అజోవ్-బ్లాక్ సీ కెనాల్‌పై ఆదివారం దాడులు చేసింది. సమారా ప్రాంతంలోని నివాస సముదాయాలు, ఒక పారిశ్రామిక వాడపై దాడి జరిగిందని స్థానిక గవర్నర్ తెలిపారు. రష్యా ఇంధన రంగ దిగ్గజం రాస్‌నెఫ్ట్‌కు చెందిన సిజ్రాన్ ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి చేసిందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయిల్ రిఫైనరీని టార్గెట్ చేశామని ఉక్రెయిన్ మిలిటరీ కూడా ప్రకటించింది. ఇంధన రంగాన్ని దెబ్బతీసి రష్యాను ఆర్థికంగా బలహీనపరచడమే తమ లక్ష్యమని పేర్కొంది. యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యాకు ఇంధన రంగ నిధులే కీలకమని పేర్కొంది.
ఇక అజోవ్-బ్లాక్ సీ కెనాల్‌లోని ఒక ఆయిల్ ట్యాంకర్‌పై కూడా ఉక్రెయిన్ డ్రోన్ దాడి నిర్వహించింది. దాడి సమయంలో ఆయిల్ ట్యాంకర్‌లో ఎలాంటి ఇంధనం లేదని రష్యా అధికారులు చెప్పారు. ఖాళీగా తిరిగొస్తోందని అన్నారు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం కూడా జరగలేదని చెప్పారు. ఇప్పటివరకూ అజోవ్-బ్లాక్ సీ పరిధిలో సుమారు 40 వరకూ ట్యాంకర్‌లపై ఉక్రెయిన్ దాడి చేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా రష్యా ఆధీనంలోని క్రిమియాకు ఇంధన సరఫరాను నిలిపివేసేందుకు ఉక్రెయిన్ ఈ దాడులు చేసింది. ఫలితంగా క్రిమియాలో పలుమార్లు ఇంధన కొరత ఏర్పడటంతో అక్కడి అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది.
మరోవైపు, రష్యా కూడా ఉక్రెయిన్‌లోని పలు పట్టణాలు, నగరాలపై మిసైల్ దాడులను కొనసాగిస్తోంది. మిసైల్ దాడులను దీటుగా అడ్డుకోలేని ఉక్రెయిన్ బలహీనతను ఆసరా చేసుకుని వ్యూహాత్మక దాడులు చేస్తోంది. తాజాగా తాము ఉక్రెయిన్‌లోని ఒడెస్సా, చోర్నోమోర్స్కీ పోర్టులపై దాడి చేసినట్టు రష్యా మిలిటరీ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు
అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ మృతి..