ఏఐతో డ్రైవర్లపై వేటు.. ఉబెర్‌పై రూ.9,224 కోట్ల జరిమానా!
ABN , Publish Date - Aug 24 , 2026 | 03:12 PM
మనుషుల పర్యవేక్షణ లేకుండా ఏఐ సాయంతో ఉబెర్ సంస్థ తన డ్రైవర్లను తొలగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో డచ్ డేటా రెగ్యులేటరీ అథారిటీ ఉబెర్‌పై ఏకంగా రూ.9 వేల కోట్ల పైచిలుకు జరిమానా విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: కింది స్థాయి ఉద్యోగి తప్పు చేస్తే పైఅధికారులు మొదట మందలిస్తారు. పద్ధతిని మార్చుకోమని హెచ్చరిస్తారు. అప్పటికీ తీరు మార్చుకోకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేసే ఈ వ్యవహారాల్లో కంపెనీలు సాధారణంగా ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. పట్టువిడుపుల ధోరణితో నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ భావోద్వేగాలే లేని ఏఐకి ఈ నిర్ణయాధికారాలను కట్టబెట్టిందన్న ఆరోపణతో డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఉబెర్‌పై ఏకంగా 825 మిలియన్ యూరోల (రూ.9224 కోట్లు) జరిమానా విధించింది.
యూరప్‌లో కొందరు ఉబెర్ డ్రైవర్‌ల సస్పెన్షన్, తొలగింపులు మనుషుల పర్యవేక్షణ లేకుండానే ఏఐ నిర్ణయాల మేరకు జరిగాయని డచ్ ప్రభుత్వం ఆరోపించింది. డ్రైవర్‌లకు ముందస్తు సమాచారం కూడా అందలేదని పేర్కొంది. కంప్యూటర్‌లు తీసుకున్న నిర్ణయాల కారణంగా కొందరు డ్రైవర్‌ల అకౌంట్స్ శాశ్వతంగా రద్దైపోయాయని చెప్పింది. ‘మనుషుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించే ఈ నిర్ణయాలను మానవుల పర్యవేక్షణ లేకుండా కంప్యూటర్లు స్వతంత్రగా తీసుకోకూడదు’ అని డచ్ డేటా రెగ్యులేటరీ సంస్థ డిప్యూటీ ఛైర్‌పర్సన్ మానిక్ వెర్డియర్ వ్యాఖ్యానించారు.
ఉబెర్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. కేవలం ఆటోమేటెడ్ కంప్యూటర్ వ్యవస్థల ఆధారంగా తాము ఏ డ్రైవర్ అకౌంట్‌ను శాశ్వతంగా రద్దు చేయలేదని స్పష్టం చేసింది. డ్రైవర్‌లపై సస్పెన్షన్స్ అన్నీ తాత్కాలికమైనవేనని పేర్కొంది. డ్రైవర్‌లను శాశ్వతంగా తొలగించే నిర్ణయాలపై మనుషుల పర్యవేక్షణ ఎప్పుడూ ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయాలను సవాలు చేసే స్వేచ్ఛ డ్రైవర్‌లకు ఇచ్చామని కూడా తెలిపింది. ఈ జరిమానా విధింపుపై అప్పీలు చేసుకునేందుకు కూడా సిద్ధం అవుతోంది.
ఇప్పటికే అనేక అమెరికన్ కంపెనీలపై ఐరోపా దేశాలు వివిధ కారణాలతో జరిమానాలు విధించాయి. ఈ జాబితాలోకి తాజాగా ఉబెర్ కూడా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ఐరోపా సమాఖ్య తీరుపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ దేశ కంపెనీలను మాత్రమే కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ ఇప్పటికే పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉబెర్ ఉదంతం నేపథ్యంలో మనుషుల జీవితాలపై ఏఐ నియంత్రణ భవిష్యత్తులో ఎంతటి స్థాయికి చేరుకుంటుందో అన్న చర్చ మొదలైంది.
ఈ వార్తలనూ చదవండి:
బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం హత్య.. అదే ఇంట్లో స్నానం, భోజనం చేసిన నిందితులు..
ఒక్క చుక్క చమురునూ రానివ్వం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..