Share News

సైబర్ దాడి.. రిఫ్రిజ్‌రేటర్ల నుంచి వేడి గాలులు

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:20 PM

స్వీడెన్, బెల్జియం దేశాల్లో ఇటీవల జరిగిన సైబర్ దాడితో మిలియన్‌ల డాలర్ల విలువైన ఆహార పదార్థాలు పాడైపోయాయి. సైబర్ దాడితో రిఫ్రిజ్‌రేటర్ల ఉష్ణోగ్రత అదుపు తప్పడంతో అవి వేడి గాలులు వెదజల్లుతూ ఒవెన్‌లను తలపించాయి.

సైబర్ దాడి.. రిఫ్రిజ్‌రేటర్ల నుంచి వేడి గాలులు
Cyberattack on Sweden and Belgium Supermarkets

ఇంటర్నెట్ డెస్క్: స్వీడెన్, బెల్జియం దేశాల్లో ఇటీవల జరిగిన సైబర్ దాడితో మిలియన్‌ల డాలర్ల విలువైన ఆహార పదార్థాలు పాడైపోయాయి. సైబర్ దాడితో రిఫ్రిజ్‌రేటర్ల ఉష్ణోగ్రత అదుపు తప్పి, అవి వేడి గాలులు వెదజల్లుతూ ఒవెన్‌లను తలపించాయి. గత నెలలో ఫ్రాన్స్‌లో ఇదే తరహా సైబర్ దాడి వెలుగుచూసింది. ఇంతలోనే మరో రెండు దేశాల్లో ఈ దాడి జరగడంతో కలకలం రేగుతోంది.

స్వీడెన్‌లోని ఐకా, కూప్ సూపర్‌మార్కెట్లు ఈసారి సైబర్ నేరగాళ్లకు టార్గెట్‌గా మారాయి. బెల్జియంలోని అహోల్డ్ డెల్‌హెయిజ్ సూపర్‌ మార్కెట్ చెయిన్‌ను నేరగాళ్లు టార్గెట్ చేసుకున్నారు. ఈదాడి తరువాత తమ సిబ్బంది రిఫ్రిజ్‌రేటర్ల ఉష్ణోగ్రతను నియంత్రించలేకపోయారని ఓ ఐకా స్టోర్ బాస్ తెలిపారు.


‘రిఫ్రిజ్‌రేటర్లలో ఉష్ణోగ్రతను మార్చలేకపోయాము. లోపలి నుంచి వేడిగాలులు వచ్చాయి. ఆహారం మొత్తం నాశనమైందని అని అన్నారు. ఫ్రిజ్‌లోపలి ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటడంతో అంతా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

బెల్జియంలోని డెల్‌హెయిజ్ సూపర్‌మార్కెట్ చెయిన్‌పైనా ఈ ప్రభావం పడింది. మొత్తం 40 షాపుల్లో ఆహారం చెడిపోయింది. స్పార్ సంస్థకు చెందిన మరో ఐదు షాపులు కూడా దెబ్బతిన్నాయి.

డాన్‌ఫోస్ అనే సంస్థకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉన్న రిఫ్రిజ్‌రేటర్లు, ఫ్రిజర్లు సైబర్ దాడి బారిన పడ్డాయి. పాత సాఫ్ట్‌వేర్ ఉన్న ఉపకరణాలనే టార్గెట్‌గా మారాయని అప్పట్లో డాన్‌ఫోస్ చెప్పింది. సాఫ్ట్‌వేర్ లోపాలను సరిదిద్దామని కూడా వెల్లడించింది. తాజా ఘటనపై మాత్రం సంస్థ ఇంకా స్పందించలేదు.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా హాలోవీన్ వేడుకల్లో ఘోర హింసాకాండ.. పలు చోట్ల సామూహిక కాల్పులు

తలచుకుంటే 10 నిమిషాల్లో అణు కేంద్రాల ధ్వంసం

Updated Date - Nov 02 , 2026 | 06:31 PM