అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడులు!
ABN , Publish Date - Sep 30 , 2026 | 03:43 AM
భారత్‌కు చెందిన ఎస్సార్ కంపెనీ అమెరికాలో భారీ పెట్టుబడులు పెడుతోంది. రూ.1.72 లక్షల కోట్ల (18 బిలియన్ డాలర్లు)తో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని నిర్మించబోతోంది.
రూ.1.72లక్షల కోట్లతో అమెరికాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్
వాషింగ్టన్, సెప్టెంబరు 29: భారత్‌కు చెందిన ఎస్సార్ కంపెనీ అమెరికాలో భారీ పెట్టుబడులు పెడుతోంది. రూ.1.72 లక్షల కోట్ల (18 బిలియన్ డాలర్లు)తో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని నిర్మించబోతోంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సార్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ రవి రుయా, ఆయన కుమారుడు రేవంత్ రుయా (మెసాబి మెటాలిక్స్ చైర్మన్)లతో కలిసి ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ‘‘లోవా రాష్ట్రంలో మెసాబి మెటాలిక్స్ సంస్థ అమెరికాలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాం’’ అని ట్రంప్ చెప్పారు. ఎస్సార్ గ్రూప్‌కు చెందిన మెసాబి మెటాలిక్స్ మిన్నెసోటా కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థ లోవాలో ఉక్కు కర్మాగారంతోపాటు మిన్నెసోటాలో ఇనుప ఖనిజం(ఐరన్ ఓర్) తవ్వకాలను చేపట్టనుంది. దీంతో అమెరికాలో 50ఏళ్ల తర్వాత తొలిసారి ఐరన్ ఓర్ తవ్వకాలు ప్రారంభించినట్లవుతుంది. 2030 కల్లా ఉక్కు ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు శ్వేతసౌధం, ఎస్సార్ గ్రూప్ ప్రకటించాయి. ఏడాదికి 10 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుందని వెల్లడించాయి. తమ పెట్టుబడులతో అమెరికా, భారత్‌ల మధ్య ఆర్థిక బంధాలు మరింత బలోపేతం అవుతాయని రవి రుయా ఆకాంక్షించారు.