Share News

అందుకే భారతీయులంటే నాకు అభిమానం: బుర్జ్ ఖలీఫా బాస్ ప్రశంస

ABN , Publish Date - May 06 , 2026 | 09:59 PM

పని పట్ల భారతీయులు ఎంతో నిబద్ధతతో ఉంటారని బుర్జ్ ఖలీఫా యజమాని మొహమ్మద్ అలబ్బార్ ప్రశ్నించారు.

అందుకే భారతీయులంటే నాకు అభిమానం: బుర్జ్ ఖలీఫా బాస్ ప్రశంస
Mohamed Alabbar

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ రియలెస్టేట్ డెవలపర్, ఎమార్ ప్రాపర్టీస్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలబ్బార్ భారతీయులపై ప్రశంసలు కురిపించారు. విధుల పట్ల భారతీయుల నిబద్ధత అమోఘమని అన్నారు. మేక్ ఇట్ ఇన్ ఎమిరేట్స్ సమ్మిట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. బుర్జ్ ఖలీఫా ఆకాశహర్మ్యాన్ని ఎమార్ ప్రాపర్టీస్ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. నిబద్ధత, మరింత శ్రమించాలన్న ఉత్సాహం, నిరంతరం మెరుగైన ఫలితాలు సాధించే ట్రాక్ రికార్డు కారణంగా తాను భారతీయ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు ప్రాధాన్యమిస్తానని ఆయన అన్నారు. పని గంటల పూర్తయిన తరువాత కూడా అనేక మంది భారతీయులు తమ సంస్థలకు అందుబాటులో ఉంటారని అన్నారు. పని పట్ల వారికున్న బాధ్యతకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.

తెలివితేటల కంటే నిరంతర శ్రమ, ప్రతి చిన్న అంశానికి ప్రాధాన్యమిచ్చే సునిశిత దృష్టే వ్యాపారంలో విజయావకాశాలను నిర్దేశిస్తాయని అన్నారు. కఠిన శ్రమ అంటే కేవలం ఎక్కువ సేపు పని చేయడం కాదని అన్నారు. అవకాశాలను సమీక్షించుకుని, అవసరమైన మేరకు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, చక్కని టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం, క్రమశిక్షణతో పని పూర్తి చేయడం వంటివన్నీ శ్రమ కిందకే వస్తాయని అన్నారు.


‘నా మేధో శక్తి తక్కువే. అయినా నిరంతర శ్రమతో అనుకున్నది సాధించవచ్చని నా అనుభవం చెబుతోంది’ అని అన్నారు. ఈ లక్షణాలు భారతీయ వృత్తినిపుణుల్లో ఉన్నాయని అన్నారు. పనిపై అత్యధిక నిబద్ధత కలిగిన వారని ప్రశ్నించారు. భారతీయులను నమ్మి పనులు అప్పగించవచ్చని కూడా అన్నారు. రోజులో ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండటంతో భారతీయులపై తనకు మరింత నమ్మకం పెరిగిందని కూడా చెప్పారు. ఎంత శ్రమపడితే అంత అదృష్టవంతులవుతారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - May 06 , 2026 | 09:59 PM