భారంగా ఏఐ సేవల నిర్వహణ
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:00 AM
కృత్రిమ మేధపై పోటాపోటీగా రూ.లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు.. ఇప్పుడు నిర్వహణ భారంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డాయి.
భారంగా ఏఐ సేవల నిర్వహణ
ఆదాయం కంటే నిర్వహణ వ్యయాలే అధికం
గ్రోక్ వినియోగ పరిమితిపై ఓ యూజర్ ప్రశ్నకు స్పందన
న్యూయార్క్, నవంబర్ 2: కృత్రిమ మేధపై పోటాపోటీగా రూ.లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు.. ఇప్పుడు నిర్వహణ భారంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డాయి. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ‘ఏఐ’ విషయంలో ఉన్న వాస్తవాన్ని అంగీకరించారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ‘ఎస్‌ఐ’ (గతంలో ఏఐ) గ్రోక్ బాట్ (స్వతంత్రంగా పనిచేసుకుపోయే ఏఐ ఏజెంట్) వినియోగంపై యూజర్లకు వారం వారీ గరిష్ఠ పరిమితులు విధించింది. ఈ పరిమితి నాలుగు రోజులకే పూర్తయిపోతుండడంతో, ముందుగానే రీసెట్ చేయాలని ఓ యూజర్ ఎక్స్‌పై చేసిన పోస్టులో కోరాడు. దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘గ్రోక్ బాట్ నిర్వహణకు అవుతున్న ఖర్చులు.. వస్తున్న ఆదాయంతో పోలిస్తే భరించలేనంత అధికంగా ఉన్నాయి’’అని బదులిచ్చారు. గ్రోక్ బాట్ సంక్లిష్టమైన టాస్క్‌లను సైతం ఇతర ఏఐ సిస్టమ్‌లతో సమన్వయం చేసుకుని నిర్వహించ గలదు. ఇందుకోసం వనరులు అధికంగా ఖర్చవుతుంటాయి. అధిక కంప్యూటింగ్ సామర్థ్యం, జీపీయూల అవసరం ఉంటుంది. దీంతో నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి.
అయినప్పటికీ స్పెస్‌ఎక్స్ ఎక్స్‌ఏఐ, మెటా, ఓపెన్ ఏఐ తదితర సంస్థలు ఏఐ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుతం నస్టాలు వస్తున్నా, భవిష్యత్తులో భారీ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చన్నది వాటి అంచనా. కానీ, నిర్వహణ వ్యయాలు తడిసి మోపెడవుతుండడంతో ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? అన్న దానిపై దృష్టి పెట్టినట్లు మస్క్ మాటలను చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు, ఏఐ సేవలకు వస్తున్న అనూహ్య డిమాండ్‌ను ఇప్పటికిప్పుడు నగదుగా మార్చుకోవడం ఎంతో కష్టమో కూడా స్పష్టమవుతోంది. ధరలను పెంచడం లేదా వ్యయాలను తగ్గించుకోవడం లేదంటే వినియోగ పరిమితులు విధించడం వాటి ముందున్న మార్గాలుగా కనిపిస్తున్నాయి.