Share News

రూ.15 లక్షల కోట్లతో బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్టు!

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:22 AM

భారత సరిహద్దుకు కూతవేటు దూరంలో టిబెట్‌లోని యార్లంగ్‌ త్సాంగ్‌పో (బ్రహ్మపుత్ర) నదిపై సుమారు రూ.15 లక్షల కోట్ల భారీ వ్యయంతో చైనా నిర్మిస్తున్న మెగా జలవిద్యుత్‌ ప్రాజెక్టు..

రూ.15 లక్షల కోట్లతో బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్టు!

  • అరుణాచల్‌ సమీపంలోని ప్రాజెక్టు పనుల్లో డ్రాగన్‌ దూకుడు.. సమీప గ్రామాల తరలింపు

  • నదీ ప్రవాహాన్ని మళ్లించే పనులు.. నామ్చాబర్వా పర్వతం గుండా 40 కి.మీ. మేర సొరంగాలు

  • శాటిలైట్‌ చిత్రాల్లో బయటపడ్డ వైనం!.. ఈశాన్య రాష్ట్రాలకు నీటికొరత, వరద ముప్పు!

గువాహటి, నవంబరు 24: భారత సరిహద్దుకు కూతవేటు దూరంలో టిబెట్‌లోని యార్లంగ్‌ త్సాంగ్‌పో (బ్రహ్మపుత్ర) నదిపై సుమారు రూ.15 లక్షల కోట్ల భారీ వ్యయంతో చైనా నిర్మిస్తున్న మెగా జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు శాటిలైట్‌ చిత్రాల విశ్లేషణలో వెల్లడైంది. ఐఐటీ ఢిల్లీకి చెందిన ఏఐ స్టార్టప్‌ ‘ఎర్త్‌సెన్స్‌ ల్యాబ్స్‌’ తాజాగా నివేదిక వివరాలను బయటపెట్టింది. భారత్‌- టిబెట్‌ సరిహద్దు రేఖ ‘మెక్‌మోహన్‌ లైన్‌’కు 40- 50 కిలోమీటర్ల దూరంలోనే చైనా ఈ 60వేల మెగావాట్ల ప్రాజెక్టును చేపడుతోంది. నది భారత్‌లోకి ప్రవేశించే ‘గ్రేట్‌ యూ-బెండ్‌’ మలుపు వద్ద బహుళ ఆనకట్టలు, విద్యుత్‌ కేంద్రాలతో నది ప్రవాహాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకునేలా ప్రాజెక్టును రూపకల్పన చేస్తోంది. ప్రధాన డ్యామ్‌ నిర్మిస్తున్న మెయిన్‌లింగ్‌ ప్రాంతంలో 2025 జూలైలో ప్రారంభమైన ఈ పనులు ఏడాది వ్యవధిలోనే కీలకదశకు చేరుకున్నాయి. అప్పటి శాటిలైట్‌ చిత్రాల్లో పచ్చని పొలాలు, గ్రామాలతో కళకళలాడిన ఆ ప్రాంతం డిసెంబరు నాటికి పూర్తిగా ఖాళీ అయిపోయి మట్టిపనులతో నిండిపోయింది. 2026 ఆగస్టు చిత్రాల్లో ఏకంగా నది ప్రవాహాన్ని మళ్లించే పనులు, నామ్చాబర్వా పర్వతం గుండా సుమారు 40కిలోమీటర్ల సొరంగాల నిర్మాణాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, గ్రామాలను తరలించి ఆ స్థానంలో కొత్త రోడ్లు, తాత్కాలిక నివాసాలు వెలవడం స్పష్టంగా కనిపించాయి. కనీసం అధికారిక శంకుస్థాపన కూడా జరగకముందే, సొరంగం బయటకు వచ్చే (ఎగ్జిట్‌) ప్రాంతంలో ముందస్తుగానే నిర్మాణ పనులు మొదలు పెట్టడం చైనా దూకుడుకు అద్దంపడుతోంది. ఈ భారీ డ్యామ్‌ ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తే, వేసవిలో దిగువ ప్రాంతాలకు నీటికొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, వర్షాకాలంలో ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరద ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.


కౌంటర్‌గా భారత్‌ సియాంగ్‌ ప్రాజెక్టు

డ్యామ్‌ వల్ల భవిష్యత్తులో తలెత్తే ముప్పు తిప్పికొట్టేందుకు భారత్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో 11,200 మెగావాట్ల ‘సియాంగ్‌ అప్పర్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్టు (ఎస్‌యూఎంపీ)ను తెరపైకి తెచ్చింది. చైనా ప్రాజెక్టు సామర్థ్యం 5.2బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (బీసీఎం) కాగా, అంతకంటే ఎక్కువగా 9.2బీసీఎం సామర్థ్యంతో ఈ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. చైనా డ్యామ్‌ వల్ల కలిగే నీటి ప్రవాహ హెచ్చుతగ్గులను ఈ ప్రాజెక్టు ద్వారా నియంత్రించవచ్చని అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ వివరించారు. అయితే, తమ భూములు ముంపునకు గురవుతాయనే ఆందోళనతో స్థానిక ఆదివాసీ ప్రజల నుంచి ఈ ప్రాజెక్టుకు నిరసనలు ఎదురవుతున్నాయి.

Updated Date - Nov 25 , 2026 | 03:25 AM