6 నెలల్లో 3 వేల పైచిలుకు భారతీయుల్ని డిపోర్టు చేసిన కెనడా
ABN , Publish Date - Aug 09 , 2026 | 09:56 AM
ఈ ఏడాది ప్రథమార్ధంలో కెనడా 3,323 మంది భారతీయులను స్వదేశానికి డిపోర్టు చేసింది. విసా నిబంధనలు కఠినతరం కావడంతో పాటు దరఖాస్తు బ్యాక్‌లాగ్‌ల తగ్గింపునకు తీసుకుంటున్న చర్యలతో డిపోర్టేషన్లు పెరుగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ప్రథమార్ధంలో కెనడా 3,323 మంది భారతీయులను స్వదేశానికి డిపోర్టు చేసింది. విసా నిబంధనలు కఠినతరం కావడంతో పాటు దరఖాస్తు బ్యాక్‌లాగ్‌ల తగ్గింపునకు తీసుకుంటున్న చర్యలతో డిపోర్టేషన్లు పెరుగుతున్నాయి. శరణార్థి అభ్యర్థనలు తిరస్కరణకు గురైన వారిని స్వదేశానికి పంపించేందుకు కెనడా అధికారులు ఇటీవల కాలంలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా వీసా, వర్క్ పర్మిట్ కాలపరిమితి ముగిసినా కెనడాలోనే కొనసాగుతున్న వారినీ డిపోర్టు చేస్తున్నారు. నకిలీ పత్రాలతో మోసాలు వెలుగుచూస్తున్నాయన్న కారణంగా దరఖాస్తు పరిశీలనను కూడా మరింత పటిష్ఠం చేశారు. తప్పుడు వివరాలను పొందుపరచడం, అడ్మిషన్‌లకు సంబంధించి మోసాలు బయటపడిన సందర్భాల్లో కూడా విదేశీయులను వారి వారి సొంత దేశాలకు సాగనంపుతున్నారు.
దేశంలోకి వలసలను తగ్గించేందుకు ఇటీవల కాలంలో కెనడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ విద్యార్థి వీసాల జారీని తగ్గించింది. జీవిత భాగస్వామి వర్క్ పర్మిట్‌ల జారీ నిబంధనలను కఠినతరం చేసింది. తాత్కాలిక ఉపాధి కోసం వచ్చే విదేశీయుల నిబంధనలను కఠినతరం చేసింది. కెనడాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులపై ప్రభుత్వ విధానాల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. డిపోర్టేషన్లు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. కెనడాలో ఉన్న వారితో పాటు భారత్‌లో ఉంటున్న ఎన్నారైల కుటుంబాల్లో టెన్షన్ పెరుగుతోంది. డిపోర్టేషన్‌తో తాము డబ్బు, విలువైన సమయం కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
డిపోర్టేషన్‌ల విషయంలో కెనడా ప్రభుత్వం ఇదే విధానాన్ని మరింత కాలం పాటు కొనసాగించే అవకాశం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెనడాలో పైచదువులకు దరఖాస్తు చేసుకునే వారు అక్కడి విద్యాసంస్థల ట్రాక్ రికార్డు, తమ డాక్యుమెంట్స్‌లో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్ తన పద్ధతిని మార్చుకోనంత వరకూ హోర్ముజ్ తెరుచుకోదు: ఇరాన్
భారత ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకాలు!