Share News

కొందరు ఖలిస్థానీలతో జాతీయ భద్రతకు ముప్పు: కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ

ABN , Publish Date - May 03 , 2026 | 10:17 PM

కొందరు ఖలిస్థానీలతో జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఎస్ఐఎస్ తన తాజా నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా కెనడా ప్రయోజనాలకు కూడా విఘాతం కలుగుతోందని చెప్పింది.

కొందరు ఖలిస్థానీలతో జాతీయ భద్రతకు ముప్పు: కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
CSIS Report on Khalistanis

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని ఖలిస్థానీ గ్రూపులతో తమ దేశభద్రతకు ముప్పు పొంచి ఉందని కెనడా నిఘా సంస్థ సీఎస్ఐఎస్ తాజాగా పేర్కొంది. తమ హింసాత్మక ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కొన్ని ఖలిస్థానీ గ్రూపులు కెనడా భూభాగాన్ని వాడుకుంటున్నాయని హెచ్చరించింది. పబ్లిక్ రిపోర్టు-2025లో ఈ వివరాలను వెల్లడించింది. అంతర్జాతీయంగా కెనడా ప్రయోజనాలకు కూడా విఘాతం కలుగుతోందని తెలిపింది.

ఈ గ్రూపులకు చెందిన కొందరు వ్యక్తులు వ్యవస్థాగత వేదికల ఆధారంగా అతివాద సందేశాలను వ్యాప్తి చేస్తూ నిధుల సమీకరణకు దిగుతున్నారని సీఎస్ఐఎస్ హెచ్చరించింది. ఈ నిధులను చివరకు హింసాత్మక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని హెచ్చరించింది. అయితే, కొన్ని గ్రూపులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని స్పష్టం చేసింది. శాంతియుత మార్గాల్లో ప్రత్యేక ఖలిస్థానీ దేశం కోసం కోరడాన్ని తాము అతివాదంగా పరిగణించట్లేదని కూడా సీఎస్ఐఎస్ స్పష్టం చేసింది. ఈ అంశంపై అనేక మంది కెనేడియన్లు శాంతియుత కార్యక్రమాలు చేస్తుంటారని కూడా చెప్పింది.


2023లో అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాలనలో భారత్‌తో దౌత్యబంధాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కెనడా ప్రధాని మార్క్ కార్నీ సారథ్యంలో ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దేందుకు తన వంతు ప్రయత్నాలను చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్ఐఎస్ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన.. తాజా డిమాండ్లు ఏంటంటే...

హెజ్‌బొల్లాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 50 కీలక స్థావరాలు ధ్వంసం

Updated Date - May 03 , 2026 | 10:29 PM