Share News

ఏఐ శివాలు.. మనిషికి సవాలు

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:39 AM

కృత్రిమే మేధ (ఏఐ) రంగంలో పని చేస్తున్న టెక్నాలజీ సంస్థలు సూపర్‌ ఇంటెలిజెన్స్‌ దిశగా ఏఐని అభివృద్ధి చేస్తూ.. మానవాళి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయని ఓ పరిశోధకుడు సంచలన ఆరోపణలు చేశారు.

ఏఐ శివాలు.. మనిషికి సవాలు

  • తమను తామే మెరుగుపర్చుకునే ఏఐని సృష్టిస్తున్న కంపెనీలు

  • అది దేన్నయినా హ్యాక్‌ చేయగలదు.. అధికారాల్ని, వనరుల్ని హస్తగతం చేసుకోగలదు

  • ఈ దశాబ్దం ఆఖరుకు వినాశకారిగా ఏఐ.. చాలా మంది నిపుణుల్లో ఆందోళన

  • ఏఐ పరిశోధకుడు జాకబ్‌ కాక్సన్‌ హెచ్చరిక.. ఆంథ్రోపిక్‌లో ఉద్యోగానికి రాజీనామా

  • ఏఐతో మానవాళి అంతమయ్యే ప్రమాదం.. మరో నిపుణుడి హెచ్చరిక

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: కృత్రిమే మేధ (ఏఐ) రంగంలో పని చేస్తున్న టెక్నాలజీ సంస్థలు సూపర్‌ ఇంటెలిజెన్స్‌ దిశగా ఏఐని అభివృద్ధి చేస్తూ.. మానవాళి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయని ఓ పరిశోధకుడు సంచలన ఆరోపణలు చేశారు. అనటమే కాదు.. తాను పని చేస్తున్న కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. ఆయనే జాకబ్‌ కాక్సన్‌. గత మూడేళ్లుగా జాకబ్‌ ఏఐ రంగంలో పని చేస్తున్నారు. తొలుత ఒపెన్‌ఏఐ, ఆ తర్వాత ఆంథ్రోపిక్‌ కంపెనీలో చేరారు. తాజాగా ఆంథ్రోపిక్‌కు రాజీనామా చేసి.. తన నిర్ణయానికి గల కారణాలను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌లో.. ఏఐతో మానవాళి ఎదుర్కోనున్న ముప్పు గురించి జాకబ్‌ హెచ్చరించారు. ‘ఏఐ కంపెనీలు పరస్పర పోటీ కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే పరిశోధనల్లో వేగం పెంచుతున్నాయి. ఫలితంగా దేన్నయినా హ్యాక్‌ చేయగల, రాత్రికిరాత్రే ఒక రంగాన్ని సమూలంగా తలకిందులు చేయగల అధికారాన్ని, వనరులను స్వాధీనం చేసుకోగల సూపర్‌ హ్యూమన్‌ వ్యవస్థల దిశగా టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మనుష్యులు చేసే ఏ చర్య కూడా ఈ స్థాయి ప్రమాదం కలిగించదు’ అని తెలిపారు. తాను మూడేళ్లపాటు పని చేసిన ఒపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌లలో ఏ కంపెనీ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదని, తమంతట తామే మెరుగుపర్చుకునే సూపర్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా అవి పరుగులు పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా ఆ కంపెనీలు మానవాళితో జూదం ఆడుతున్నాయన్నారు.


ఏఐతో భవిష్యత్తులో మానవ సమాజానికి కలిగే నష్టం గురించి ఒపెన్‌ఏఐలో చాలామందికి తెలియదని, ఆంథ్రోపిక్‌లో మాత్రం రిస్క్‌ గురించి తెలిసి కూడా రేసులో తామే ముందు ఉండాలని భావించి ఆ దిశగా పెద్దఎత్తున పరిశోధనలు నిర్వహిస్తున్నారని జాకబ్‌ కాక్సన్‌ వెల్లడించారు. ఈ దశాబ్దం చివరికి ఏఐ వినాశనకారిగా పరిణమించే ప్రమాదం ఉందని ఈ రంగంలో పని చేస్తున్న పలువురు భావిస్తున్నట్లు తెలిపారు. అనియంత్రిత ఏఐ కారణంగా కలిగే నష్టాల గురించి అంతర్గతంగా తీవ్ర ఆందోళన చెందే పలువురు టెక్నాలజీ నిపుణులు బయట మాత్రం అంత భయపడాల్సిన అవసరమేమీ లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన హగ్గింగ్‌ ఫేస్‌ బ్రీచ్‌ ఘటన నేపథ్యంలోనైనా ఏఐ కంపెనీల మధ్య పోటీని నివారించేలా ఓ ఒప్పందాన్ని అత్యవసరంగా తీసుకురావటానికి ప్రయత్నాలు జరగాలని సూచించారు (ఒక ఒపెన్‌ఏఐ ఇటీవల తన పరిధిని దాటుకొని.. మేజర్‌ ప్లాట్‌ఫాంలలో ఒకటైన హగ్గింగ్‌ఫే్‌సలోకి చొరబడింది). ఏఐ రంగంలో పని చేసే తన మాజీ సహచరులకు కూడా పరిస్థితులను సమీక్షించుకోవాలని జాకబ్‌ కాక్సన్‌ పిలుపునిచ్చారు.


మేం సరైన మార్గంలో వెళ్లడం లేదు!

జాకబ్‌ పోస్టు కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆంథ్రోపిక్‌లో అలైన్‌మెంట్‌ సైన్స్‌ విభాగం హెడ్‌గా ఉన్న ఎవాన్‌ హుబింగర్‌ ఈ పోస్టుపై స్పందిస్తూ.. ‘జాకబ్‌ చెప్పింది నిజమే. మానవాళి మొత్తాన్ని ఏఐ అంతం చేయగలదని మేం నిజంగానే ఆందోళన చెందుతున్నాం. వచ్చే పదేళ్లలో ఈ ప్రమాదం 10 శాతం మేర ఉంటుందని నేను వ్యక్తిగతంగా అంచనా వేస్తున్నా. సూపర్‌ ఇంటెలిజెన్స్‌ మనుష్యుల నియంత్రణ దాటుకొని ఇష్టారీతిన ప్రవర్తించకుండా అడ్డుకునే వ్యవస్థల కోసం ఆంథ్రోపిక్స్‌ శాయశక్తులా కృషి చేస్తోంది. కానీ, ఇప్పటి వరకూ దీనికి సంబంధించి ఒక ప్రణాళిక అంటూ మా వద్ద లేదు. మేం సరైన మార్గంలో వెళ్తున్నామని కూడా అనిపించటం లేదు. అయితే, ప్రస్తుత మోడల్స్‌తో రిస్క్‌ తక్కువే. కానీ, ఏఐ తనను తాను మళ్లీ మళ్లీ మెరుగుపరుచుకునే టెక్నాలజీ ఊహించిన దానికంటే ఎక్కువ వేగంతో అభివృద్ధి చెందుతోంది. దీంతోనే ప్రమాదం పొంచి ఉంది’ అని పేర్కొన్నారు. ఏఐ కంపెనీలు తాము అభివృద్ధి చేస్తున్న వ్యవస్థల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని, ఇది మనుష్యులకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని పలువురు పరిశోధకులు, విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. టెస్లా అధినేత ఎలాన్‌మ్‌స్క కూడా ఏఐతో మానవాళికి ముప్పేనని గత కొన్నేళ్లుగా చెబుతున్నారు.

Updated Date - Sep 10 , 2026 | 06:55 AM