Share News

పురుషాంగాల దొంగలంటూ..

ABN , Publish Date - Sep 07 , 2026 | 03:49 AM

భయం.. మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది! ఆ భయానికి కారణం మూఢనమ్మకమైతే.. ఫలితం మరింత దారుణంగా ఉంటుంది!! ‘‘మంత్రగత్తె అనే పేరుతో మహిళను సజీవ దహనం చేసిన గ్రామస్థులు’’ ..లాంటి వార్తలకు కారణం మూఢనమ్మకాల వల్ల కలిగే భయ

పురుషాంగాల దొంగలంటూ..
In Africa incident

  • ఆరు ఆఫ్రికన్‌ దేశాల్లో 80 మందిని కొట్టిచంపేసిన జనం

  • ఒక్క మొజాంబిక్‌లోనే ఆరు వారాల్లో

  • 55 మంది మృతి.. పలువురికి గాయాలు

కిన్షాసా, సెప్టెంబరు 6: భయం.. మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది! ఆ భయానికి కారణం మూఢనమ్మకమైతే.. ఫలితం మరింత దారుణంగా ఉంటుంది!! ‘‘మంత్రగత్తె అనే పేరుతో మహిళను సజీవ దహనం చేసిన గ్రామస్థులు’’ ..లాంటి వార్తలకు కారణం మూఢనమ్మకాల వల్ల కలిగే భయమే. మనకే కాదు.. ఆఫ్రికా దేశాలవారికీ ఇలాంటివి చాలానే ఉంటాయి. కొంత మంది వ్యక్తులు ఏ పురుషుడి భుజంపై అయినా చెయ్యి వేస్తే వారి పురుషాంగం కుచించుకుపోతుంది లేదా మాయమైపోతుందనేది వారికున్న మూఢనమ్మకాల్లో ఒకటి. ఇది వేల ఏళ్లుగా ఉన్నదే. మధ్యమధ్యలో ఒక్కసారిగా ఈ తరహా వదంతులు ప్రబలి.. మళ్లీ కొన్నాళ్లకు వాటంతటవే సర్దుకుంటుంటాయి. అలా సర్దుకునే లోపు కొన్ని వందల మందిని ‘పురుషాంగాల దొంగలు’ అనే పేరుతో చంపేస్తారు! 2008లో ఇలాగే కాంగో రాజధాని కిన్షాసాలో ‘పురుషాంగాల చోరీ’ అంటూ వదంతులు వ్యాపించి.. తర్వాత సద్దుమణిగాయి. మళ్లీ గత ఏడాది మొదట్లో అదే కాంగోలో మొదలైన ఈ వదంతులు.. సోషల్‌ మీడియా దెబ్బకు ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు వ్యాపించాయి. జాంబియా, మలావీ, బురుండి, మొజాంబిక్‌, టాంజానియా, కెన్యా తదితర దేశాలను చుట్టుముట్టాయి. ఫలితంగా.. నిరుడు అక్టోబరు నుంచి ఈ ఏడాది జూలై నడుమ ఆరు దేశాల్లో 80 మందికిపైగా అమాయకుల్ని ఇలా ‘పురుషాంగాల దొంగల’నే పేరుతో జనం దారుణంగా చంపేశారు. ఒక్క మొజాంబిక్‌ దేశంలోనే ఆరు వారాల వ్యవధిలో 55 మందిని పొట్టనపెట్టుకున్నారు. చనిపోయినవారిలో ఒక పోలీసు అధికారి, ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉన్నారు. వారిలో కొంతమందిని కొట్టి చంపారు. కొందరిని ఉరి తీశారు. ఇంకొంతమందిని సజీవదహనం చేశారు. ఇలాంటి నిజ జీవిత సంఘటనలకు తోడు.. కొందరు కంటెంట్‌ క్రియేటర్లు వ్యూస్‌, లైకులు, షేర్ల కోసం ఈ వదంతులను మరింతగా వైరల్‌ చేయడం.. ‘అక్కడ అలా జరిగింది.. ఇక్కడ ఇలా జరిగింది.. మీరు జాగ్రత్త పడండి. మీ పురుషాంగాన్ని కాపాడుకోండి’ అంటూ పెద్ద ఎత్తున వీడియోలు చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది.


ఉన్నట్టుండి అరుస్తారు..

జనం చాలా ఎక్కువగా ఉన్న చోట్ల.. అంటే సంతల్లోనో, ఎగ్జిబిషన్ల వంటి చోట్లో లేక రద్దీగా ఉండే మార్కెట్‌ ప్రదేశాల్లో ఎవరో ఒకరు ఉన్నట్టుండి తమ పక్కనున్న వ్యక్తిని పట్టుకుని.. ‘‘నా పురుషాంగాన్ని కుచించుకుపోయేలా చేశావ్‌/దొంగిలించావ్‌.. దాన్ని నాకిచ్చెయ్‌’’ అంటూ గట్టిగట్టిగా అరుస్తూ గొడవ చేయడం మొదలుపెడతారు. అవతలి వ్యక్తికి విషయం అర్థం కాక తనకేం తెలియదంటూ ఆందోళనతో అరుస్తుంటాడు. ఇంతలో అక్కడున్న జనమంతా వారిచుట్టూ మూగుతారు. ‘నా పురుషాంగం పోయింది’ అని చెప్పిన వ్యక్తి మాటలు నమ్మి.. అవతలి వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేస్తారు.

ఇవి కూడా చదవండి

ఏడాదిన్నర బ్రేక్ తరువాత జిమ్‌కు రకుల్.. వీడియో వైరల్

అనుష్క.. తెలుగుకు గుడ్ బై ఇంకా

Updated Date - Sep 07 , 2026 | 03:58 AM