Share News

టాబ్లెట్‌పై గీత ఎందుకు ఉంటుంది? దాని ఉపయోగం మీకు తెలుసా?

ABN , Publish Date - Jun 29 , 2026 | 01:55 PM

టాబ్లెట్‌ మధ్యలో కనిపించే గీతను చాలామంది కేవలం డిజైన్‌లో భాగమే అనుకుంటారు. కానీ దానికి ఒక ప్రత్యేకమైన ఉపయోగం ఉందని మీకు తెలుసా? మరి మాత్రలపై ఉండే ఈ గీతను ఏమంటారు? దాని ప్రాముఖ్యం ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

టాబ్లెట్‌పై గీత ఎందుకు ఉంటుంది? దాని ఉపయోగం మీకు తెలుసా?
Tablet Score Line

ఇంటర్నెట్ డెస్క్: జ్వరం, జలుబు, తలనొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు వైద్యులు మందులు సూచిస్తారు. మీరు ఎప్పుడైనా టాబ్లెట్‌ను గమనిస్తే, దాని మధ్యలో ఒక గీత కనిపిస్తుంటుంది. ఉంటుంది. చాలామంది దాన్ని కేవలం డిజైన్ అనుకుంటారు. కానీ ఆ గీతకు ప్రత్యేకమైన ప్రయోజనం ఉందని నిపుణులు చెబుతున్నారు.


టాబ్లెట్‌‌పై ఉన్న గీతను ఏమంటారు?

టాబ్లెట్‌ మధ్యలో ఉండే గీతను 'స్కోర్ లైన్' (Score Line) లేదా 'బ్రేక్ లైన్' (Break Line) అంటారు. అవసరమైతే మాత్రను సమానంగా రెండు భాగాలుగా విరిచేందుకు ఈ గీతను ఉంచుతారు.

ఈ గీత ఎందుకు ఉపయోగపడుతుంది?

కొన్ని సందర్భాల్లో వైద్యులు సగం మాత్ర మాత్రమే తీసుకోవాలని సూచిస్తారు. ఉదాహరణకు, 500 మిల్లీగ్రాముల మాత్రలో 250 మిల్లీగ్రాములు మాత్రమే అవసరమైతే, స్కోర్ లైన్ ఉన్న మాత్రను రెండు సమాన భాగాలుగా విరిచి ఒక భాగాన్ని తీసుకోవచ్చు. దీంతో సరైన మోతాదులో మందు తీసుకునే అవకాశం ఉంటుంది.


వృద్ధులు, పిల్లలకు కూడా ఉపయోగమే

పెద్ద మాత్రలను మింగడం వృద్ధులు, పిల్లలకు కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో స్కోర్ లైన్ ఉన్న మాత్రను చిన్న ముక్కలుగా విరిచి తీసుకోవడం సులభమవుతుంది.

అన్ని టాబ్లెట్‌లను రెండు భాగాలుగా విరవకూడదు. స్కోర్ లైన్ లేని మాత్రలు, అలాగే ప్రత్యేక పూత (కోటింగ్) ఉన్న లేదా నెమ్మదిగా పనిచేసే (సస్టెయిన్డ్/ఎక్స్‌టెండెడ్ రిలీజ్) మాత్రలను విరవడం లేదా నలిపేయడం మంచిది కాదు. అలా చేస్తే మందు పనిచేసే విధానం మారిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గుర్తుంచుకోవాల్సిన విషయం

కొంతమంది మాత్రను మింగలేక తమంతట తామే నలిపి లేదా విరిచి తీసుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మందు ప్రభావం తగ్గవచ్చు లేదా అనుకోని దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల టాబ్లెట్‌ను పూర్తిగా తీసుకోవాలా, సగం మాత్రగా వేసుకోవాలా అనేది వైద్యుల సూచన మేరకే తీసుకోవాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

వ్యాధుల కాలం.. జర పైలం

Updated Date - Jun 29 , 2026 | 02:01 PM