Share News

సిగరెట్ తాగితే జ్ఞాపకశక్తి తగ్గిపోతుందా?

ABN , Publish Date - Aug 27 , 2026 | 02:40 PM

సిగరెట్‌ తాగడం వల్ల ఊపిరితిత్తులు మాత్రమే కాకుండా మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తిపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సిగరెట్ తాగితే జ్ఞాపకశక్తి తగ్గిపోతుందా?
Smoking And Memory Loss

ఇంటర్నెట్ డెస్క్: సిగరెట్‌ తాగడం వల్ల ఊపిరితిత్తులు మాత్రమే కాకుండా మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ధూమపానం జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు గుర్తించారు. ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కలిసి ఉంటే వృద్ధాప్యంలో డిమెన్షియా (మతిమరుపు) వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది.

సిగరెట్‌ పొగ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందన్న విషయం చాలామందికి తెలుసు. అయితే ధూమపానం మెదడు పనితీరుపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, ఇటీవల జరిగిన విషయాలను గుర్తుంచుకోలేకపోవడం వంటి సమస్యలు వయసు పెరిగేకొద్దీ ఎక్కువయ్యే అవకాశం ఉంది.


ప్రమాద కారకాలు పెరిగే కొద్దీ ముప్పు ఎక్కువ

అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం అనే మూడు ప్రమాద కారకాలు ఏవీ లేని 55 ఏళ్ల వ్యక్తుల్లో డిమెన్షియా లేకుండా ఉండే కాలం సగటున 30 ఏళ్లుగా ఉంది. అంటే 85 ఏళ్ల వయసు వరకు కూడా డిమెన్షియా లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా కనిపించింది.

ఇక ఈ మూడు ప్రమాద కారకాల్లో ఒకటి ఉన్నవారిలో డిమెన్షియా లేకుండా ఉండే కాలం సగటున 26 ఏళ్లుగా ఉంది. రెండు ప్రమాద కారకాలు ఉన్నవారిలో ఇది 21 ఏళ్లకు తగ్గింది. మూడు ప్రమాద కారకాలు ఉన్నవారిలో కేవలం 17.5 ఏళ్లుగా నమోదైంది. మొత్తంగా చూస్తే.. ప్రమాద కారకాలు పెరిగే కొద్దీ డిమెన్షియా వచ్చే వయసు కూడా తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.


జీవనశైలిలో మార్పులతో ముప్పును తగ్గించుకోవచ్చు

డిమెన్షియా ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, కొన్ని ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా దాని ముప్పును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలను నియంత్రించడం ద్వారా డిమెన్షియా కేసులను గణనీయంగా నివారించవచ్చని సూచిస్తోంది.

మొత్తంగా.. సిగరెట్‌ తాగడం వల్ల కలిగే నష్టాలు ఊపిరితిత్తులకే పరిమితం కావు. దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తిపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ధూమపానాన్ని వీలైనంత త్వరగా మానేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Updated Date - Aug 27 , 2026 | 02:41 PM