Share News

మనసుకు ప్రశాంతత కావాలా? ఈ జపనీస్ టెక్నిక్స్‌ ట్రై చేయండి

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:22 AM

రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, బిజీ షెడ్యూల్‌ కారణంగా మనసు అలసిపోతుంటుంది. ఇలాంటి సమయంలో మనసుకు ప్రశాంతతను అందించేందుకు జపనీస్‌ జీవనశైలిలోని కొన్ని సులభమైన పద్ధతులను ప్రయత్నించవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

మనసుకు ప్రశాంతత కావాలా? ఈ జపనీస్ టెక్నిక్స్‌ ట్రై చేయండి
Japanese Mind Detox

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యంగా ఉండేందుకు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, అనవసర ఆలోచనలు మనపై ప్రభావం చూపుతుంటాయి. వీటిని తగ్గించుకుని మానసిక ప్రశాంతత పొందేందుకు జపాన్‌లో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తుంటారు. అవేంటో చూద్దాం..


ఆలోచనలను గమనించండి

ఖాళీగా కాసేపు కూర్చుంటే చాలు.. రకరకాల ఆలోచనలు మనసులోకి వస్తుంటాయి. ఇవి మన ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఇలాంటి ఆలోచనలను నియంత్రించేందుకు జపాన్‌లో ‘జాజెన్’ (Zazen) అనే ధ్యాన పద్ధతిని పాటిస్తారు.

ప్రశాంతమైన ప్రదేశంలో వెన్నెముక నిటారుగా ఉంచుకుని కూర్చోవాలి. చేతులను ముందుకు ఉంచుకోవాలి. కళ్లను పూర్తిగా మూసుకోకుండా సగం మూసి, సగం తెరిచి ఉంచాలి. ఇలా కూర్చున్నప్పుడు మనసులోకి ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని మంచివి, చెడ్డవి అని నిర్ణయించకుండా అలాగే గమనించాలి.

అదే సమయంలో నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనసును వేధించే ఆలోచనలపై వెంటనే స్పందించకుండా ఉండే అలవాటు ఏర్పడుతుంది. క్రమంగా ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారడానికి ఇది సహాయపడుతుంది. రోజూ కొంత సమయం ఈ పద్ధతిని సాధన చేస్తే మానసిక ప్రశాంతతను పొందవచ్చని చెబుతున్నారు.


లోపాలను అంగీకరించండి!

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. అయితే చాలామంది తమ లోపాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది.

అందుకే మనలోని లోపాలను కూడా జీవితంలో ఒక భాగంగా అంగీకరించాలని జపనీస్ సంస్కృతిలోని ‘కింట్సుగి’ (Kintsugi) భావన చెబుతుంది. జపాన్‌లో పగిలిపోయిన వస్తువులను పడేయకుండా వాటిని ప్రత్యేకమైన పద్ధతిలో అతికించి, పగుళ్లు కనిపించేలా మరింత అందంగా తయారు చేస్తారు. అంటే.. ఆ పగుళ్లను లోపంగా కాకుండా ఆ వస్తువును ప్రత్యేకంగా చూస్తారు.

అదే విధంగా మనలోని లోపాలను కూడా అంగీకరించి, వాటిని మన ప్రత్యేకతగా భావించాలని ఈ భావన సూచిస్తుంది. ఇలా సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.


ప్రశాంత వాతావరణంలో కాసేపు గడపండి

మనసు ప్రశాంతంగా లేకపోయినా లేదా ఒత్తిడిగా అనిపించినా చాలామంది దేవాలయానికి వెళ్లి కొంత సమయం గడుపుతుంటారు. అక్కడ ప్రశాంతంగా కూర్చోవడం, ప్రార్థన చేయడం, ధ్యానం చేయడం వల్ల మనసుకు ఉపశమనం లభిస్తుందని భావిస్తారు.

జపాన్‌లోని ‘ఒటెరా థెరపీ’ (Otera Therapy) కూడా ఇలాంటి భావనతోనే ఉంటుంది. అయితే అక్కడి బౌద్ధ దేవాలయాలకు కేవలం సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే కాకుండా రోజువారీ జీవితంలో కూడా కొంత సమయం కేటాయిస్తారు.

దేవాలయానికి వెళ్లి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవడం, ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం, యోగా వంటి సాధనలు చేయడం వంటివి చేస్తారు. ఇలా కొంత సమయం ప్రశాంతంగా గడపడం వల్ల రోజువారీ ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందడంతో పాటు తమ గురించి తాము ఆలోచించుకునే అవకాశం లభిస్తుంది.

జీవితంలో ఏ విషయాలు ముఖ్యమైనవి? ఏవి అనవసరమైనవి? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? వంటి విషయాలను ఆలోచించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతారు. మనల్ని మనం అర్థం చేసుకుని, అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఈ విధానం సూచిస్తుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Updated Date - Aug 12 , 2026 | 11:22 AM