చెవి గులిమి.. ఆరోగ్య రహస్యాలను చెబుతుందా?
ABN , Publish Date - Jun 23 , 2026 | 04:41 PM
చెవి గులిమి కేవలం చెవిని రక్షించడమే కాదు, మన ఆరోగ్యం గురించి కూడా కొన్ని ముఖ్యమైన సంకేతాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గులిమి రంగు కొన్ని ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మన శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే అది వివిధ లక్షణాల ద్వారా సంకేతాలు ఇస్తుంది. అదే విధంగా చెవిలో ఏర్పడే గులిమి (Ear Wax) కూడా ఆరోగ్య పరిస్థితుల గురించి కొన్ని సూచనలు ఇవ్వగలదని నిపుణులు చెబుతున్నారు. చెవి గులిమి రంగు కొన్ని ఆరోగ్య సమస్యలను గుర్తించడంలో సహాయపడవచ్చని అంటున్నారు.
చాలామంది చెవిలో గులిమి కనిపించగానే వెంటనే ఇయర్‌బడ్స్‌తో శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ చెవి గులిమి అనేది చెవిని రక్షించే సహజ రక్షణ వ్యవస్థలో భాగం. ఇది దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వంటి హానికర పదార్థాలు చెవిలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.
చెవి గులిమి రంగులు ఏమి సూచిస్తాయి?
లేత గోధుమ లేదా పసుపు రంగు
ఇది సాధారణంగా ఆరోగ్యకరమైన చెవి గులిమికి సంకేతంగా భావిస్తారు.
ముదురు గోధుమ రంగు
చెవిలో గులిమి చాలా కాలంగా పేరుకుపోయిందని సూచించవచ్చు.
ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగు
చెవి లోపల చిన్న గాయం లేదా రక్తస్రావం జరిగి ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులని సంప్రదించడం మంచిది.
ఆకుపచ్చ లేదా క్రీమ్ రంగు
ఇది చెవిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు సూచించవచ్చు. ముఖ్యంగా దుర్వాసన, నొప్పి లేదా చీము వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యల సలహా తీసుకోవాలి.
చెవిలో గులిమి ఎందుకు పేరుకుపోతుంది?
చెవి గులిమి దుమ్ము, మురికి, బ్యాక్టీరియాను బంధించి చెవిని రక్షిస్తుంది. అయితే గులిమి అధికంగా ఉత్పత్తి కావడం, చెవిని తరచూ ఇయర్‌బడ్స్‌తో శుభ్రం చేయడం, ఇయర్‌ఫోన్లు ఎక్కువసేపు ఉపయోగించడం, చెవి కాలువ ఇరుకుగా ఉండటం వంటి కారణాల వల్ల గులిమి పేరుకుపోవచ్చు.
చెవి నుంచి దుర్వాసన వస్తే?
చెవి నుంచి దుర్వాసన రావడం సాధారణంగా ఇన్ఫెక్షన్‌కు సంకేతంగా పరిగణిస్తారు. బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. దీనితో పాటు తల తిరగడం, చెవిలో శబ్దం, వినికిడి తగ్గడం లేదా చెవి మూసుకుపోయినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
వయసు పెరిగే కొద్దీ చెవిలోని గ్రంథులు తక్కువ స్రావం ఉత్పత్తి చేస్తాయి. దీంతో గులిమి పొడిగా లేదా పొరలుగా కనిపించవచ్చు. ఇది సాధారణంగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు. అయితే దురద, నొప్పి, వాపు లేదా వినికిడి సమస్యలు ఉంటే వైద్యులని సంప్రదించడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
గుడ్లతో ఈ ఆహారాలు తింటే సమస్యలే!
మీరు వాడే కారం పొడి కల్తీదో కాదో ఇలా గుర్తించండి