కొవిడ్ కేసులు.. మాస్క్ మళ్లీ తప్పనిసరిగా మారుతుందా?
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:18 AM
కరోనా ముప్పు మళ్లీ మొదలైందా? కరోనా వేవ్‌పై నిపుణులు ఏమంటున్నారు? మళ్లీ మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం ఎంత వరకు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని పలుచోట్ల కొవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో మరోసారి కరోనా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 339 కోవిడ్ కేసులు
జూన్ 26 నుంచి జులై 16 వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 12 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో నలుగురు మృతి చెందారు. అయితే ఈ నలుగురికీ ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు వంటి ఇతర తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా జులై నెలలో ఇప్పటి వరకు మొత్తం 339 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో కొత్త కరోనా వేవ్‌కు సంబంధించిన సంకేతాలు లేవు. అందువల్ల ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొవిడ్, ఫ్లూ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయని తెలిపారు. జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం మూడు నుంచి ఐదు రోజులకుపైగా కొనసాగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలని సూచించారు.
మాస్క్ మళ్లీ ధరించాలా?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. అయితే ఈ పరిస్థితుల్లో మాస్క్ ధరించడం మంచిది..
జ్వరం, దగ్గు, గొంతునొప్పి లేదా జలుబు లక్షణాలు ఉన్నప్పుడు
ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు
బస్సులు, రైళ్లు, విమానాలు వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు
వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రద్దీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలి.
పాటించాల్సిన జాగ్రత్తలు
రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు అవసరమైతే మాస్క్ ధరించాలి.
బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
దగ్గు, జలుబు ఉంటే ఇతరులకు వ్యాప్తి చెందకుండా మాస్క్ ధరించాలి.
పిల్లలకు జ్వరం లేదా జలుబు ఉంటే పాఠశాలకు పంపకుండా ఇంట్లోనే విశ్రాంతి ఇవ్వాలి.
ఇళ్లలో తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?
ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!